రేపు ఆది శంకరుల జయంతి | - | Sakshi
Sakshi News home page

రేపు ఆది శంకరుల జయంతి

Apr 20 2026 9:47 AM | Updated on Apr 20 2026 9:47 AM

శ్రీశైలంటెంపుల్‌: వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా మంగళవారం ఆదిశంకరాచార్యుల జయంతి నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9 గంటలకు పాలధార–పంచధార ఉన్న శంకర మందిరంలో ప్రత్యేక పూజలు చేపడుతామన్నారు. శంకరులు శ్రీశైలంలోని పాలధార–పంచధార వద్ద కొంతసేపు తపస్సు చేసి ఇక్కడే శివానందలహరి గ్రంథాన్ని రచించారని తెలిపారు.

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 20వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్‌ కార్యాలయాల్లో, డివిజన్‌ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.

అన్నప్రసాద వితరణకు రూ.3 లక్షల విరాళాలు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3 లక్షల విరాళాలను అందజేశారు. ఆదివారం మహారాష్ట్ర రాష్ట్రం పూణేకు చెందిన ప్రమోద్‌గుప్తా రూ.లక్ష , హైదరాబాద్‌కు చెందిన రమేష్‌ బాబు రూ. లక్ష, టీ.నాగేంద్రకుమార్‌ రూ.1,05,000, విరాళాన్ని పర్యవేక్షకులకు అందజేశారు. విరాళాలను అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.

ఓంకారంలో మహిళ అదృశ్యం

ఆమె వద్ద 12 తులాల బంగారం

బండిఆత్మకూరు: మండల పరిధిలోని ఓంకార దేవస్థానంలో ఓ మహి ళ మిస్సింగ్‌ అయిన ఘటన కలకలం రేపుతోంది. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఖాదరాబాద్‌ గ్రామానికి చెందిన జింకల లక్ష్మీదేవి తన కూతురు, మనువరాలు, మరి కొందరితో కలిసి ఒక ఆటోలో ఆదివారం ఉదయం ఓంకార పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో భోజనం చేసిన అనంతరం తిరిగి ఇంటికి బయలు దేరే సమయానికి లక్ష్మీదేవి కనిపించకుండా పోయింది. ఆ సమయంలో ఆమె వద్ద సుమారు 12 తులాల బంగారం ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఎస్‌ఐ జగన్‌ మోహన్‌ సిబ్బందితో చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 8985541339, 9849484977 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

క్వింటా వేరుశనగ రూ.7,394

ఎమ్మిగనూరు టౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు ఆదివారం వేరుశనగ దిగుబడులు 1,212 క్వింటాళ్లు వచ్చాయి. క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.7,394 ధర పలికింది, కనిష్ట ధర రూ.3,860, మధ్యస్థ ధర క్వింటం రూ.5,627 పలికినట్లు మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఆముదాలు 67 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ.5,010, మధ్యస్థ ధర క్వింటం రూ.5,709, గరిష్ట ధర రూ.5,890, అదేవిధంగా మొక్కజొన్న 25 క్వింటాళ్లు విక్రయానికి రాగా అందులో క్వింటం కనిష్ట ధర రూ.1,410, మధ్యస్థ ధర రూ.1,455, గరిష్ట ధర రూ.1,480కు వ్యాపారు లు కొనుగోలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement