‘ప్రత్యేక’ నిర్లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక’ నిర్లక్ష్యం!

Apr 20 2026 9:47 AM | Updated on Apr 20 2026 9:47 AM

ఉత్తర్వులు రాలేదు

ఫెయిల్‌ అయిన ఇంటర్‌ విద్యార్థులకు

మొదలవ్వని ప్రత్యేక తరగతులు

ఉత్తర్వులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్‌ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఈ ఏడాది మొదటి సంవత్సర విద్యార్థులు జిల్లాలో 6,813 మంది ఫెయిల్‌ అయ్యారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు తిరిగి ఉత్తీర్ణులు అయ్యేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ‘ప్రత్యేక’ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నెల 1వ తేదీ నుంచే ఇంటర్మీడియెట్‌ రెండో సంత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఫెయిల్‌ అయిన విద్యార్థులు సెకండియర్‌ తరగతులకు హాజరుకావాలా? ఫెయిల్‌ అయిన సబ్జెక్టులు చదువుకోవా లా? అని ఆందోళన చెందుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 21 నుంచి జూన్‌ 4వతేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయినవారికి జూన్‌ 7 నుంచి 11వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో మాత్రమే పరీక్షలు జరపనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 20 నుంచి 27వ తేదీలోపు పరీక్ష ఫీజులు చెల్లించాలి. జిల్లాలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులు మొత్తం 23,169 మంది పరీక్షలు రాస్తే 16,356 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరితోపాటు రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ అవకాశం ఇచ్చారు. ఈ నెల 20 నుంచి 27వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. ఈ తేదీల్లోనే ఫెయిల్‌ అయిన విద్యార్థులు, మార్కులు తక్కువ వచ్చినవారు, వచ్చిన మార్కులపై అనుమానమున్న వారు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఫీజుల వివరాలు..

● రీకౌంటింగ్‌కి ఒక్కో పేపర్‌కు రూ.260

● రీవెరిఫికేషన్‌తో పాటు, స్కాన్‌ చేసిన సమాధాన పత్రానికి ఒక్కో సబ్జెక్టుకు రూ.1,300

● సప్లిమెంటరీ ఫస్ట్‌ ఇయర్‌లో థియరీ పరీక్షలకు రూ.600

● ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ.275

● బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ.275

● ఫస్ట్‌ ఇయర్‌, సెకండియర్‌ థియరీ పరీక్షలకు రూ.1,200

● వొకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ.550

● మొదటి, ద్వితీయ పరీక్షల్లో పాసై, మార్కులు పెంచుకునేందుకు ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1350, సైన్స్‌ విద్యార్థులు రూ.1,600.

ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాసి సెకండియర్‌లోకి వచ్చిన విద్యార్థులకు ఈనెల 1 నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది.

– జి.లాలెప్ప, ఇంటర్మీడియెట్‌ విద్యా

మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement