శ్రీశైలంలో 16 నుంచి ఉగాది ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో 16 నుంచి ఉగాది ఉత్సవాలు

Mar 1 2026 7:27 AM | Updated on Mar 1 2026 7:27 AM

శ్రీశ

శ్రీశైలంలో 16 నుంచి ఉగాది ఉత్సవాలు

20 వరకు నిర్వహణ

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారన్నారు. గతేడాది 7 లక్షల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.

తాగునీరు.. వైద్య సదుపాయాలు

భక్తులకు సమృద్ధిగా తాగునీరు అందించేందుకు రోజుకు 4 నుంచి 5 లక్షల నీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలన్నారు. మార్చి 8వ తేదీ నుంచి ప్రధాన ప్రదేశాలు, పార్కింగ్‌ స్థలాలు, పాదయాత్ర మార్గాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి రొటేషన్‌ పద్ధతిలో వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. బయో మెడికల్‌ వ్యర్థాలను ప్రత్యేకంగా రెడ్‌ కలర్‌ డస్ట్‌బిన్లలో సేకరించి తక్షణం నిర్వహించాలన్నారు.

పారిశుద్ధ్యం.. మౌలిక వసతులు

ఆర్‌డబ్ల్యుఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖలు సమన్వయంతో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. భక్తులు వినియోగించిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను నిర్దిష్ట ప్రదేశాల్లో సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గాలివానలు వచ్చినా షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు దృఢంగా ఉండేలా ఆర్‌ అండ్‌ బి శాఖ తనిఖీలు నిర్వహించాలన్నారు. విద్యుత్‌ తీగలు వేలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

పార్కింగ్‌ .. ట్రాఫిక్‌ నిర్వహణ

పార్కింగ్‌ ప్రదేశాల్లో తగినంత వెలుతురు, త్రాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు వాహనాలు మొరాయించినపుడు తరలించేందుకు క్రేన్లు, టోయింగ్‌ వాహనాలు మెకానిక్స్‌తో సహా సిద్ధంగా ఉంచాలన్నారు. లింగాలగట్టు, పాతాళగంగా ప్రాంతాల్లో ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. తెలుగు, కన్నడ భక్తుల కోసం శ్రీమే ఐ హెల్ప్‌ యూశ్రీ డెస్క్‌లను పెంచాలని, ముఖ్యంగా కన్నడ భక్తులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ద్వారా కన్నడలోనూ ప్రకటనలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించకుండా పర్యవేక్షణ చేయాలని, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

దర్శన ఏర్పాట్లు

రోజుకు 8,000 నుంచి 10,000 మందికి స్లాట్‌ విధానంలో దర్శనం కల్పించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఒక్కో స్లాట్‌ రెండు గంటల పాటు ఉండగా, మొత్తం ఎనిమిది గంటలు స్లాట్‌ దర్శనం నిర్వహిస్తామని . మిగిలిన సమయంలో ఉచిత దర్శనం కొనసాగుతుందని, స్పర్శ దర్శనం ప్రారంభానికి గంటన్నర ముందే ఉచిత దర్శనం క్యూ లైన్లను ఖాళీ చేసేలా సమన్వయం చేసుకోవాలన్నారు.

వలంటీర్ల నియామకం

జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాల వివరాలను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. పాతాళగంగ బోటు సేవల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తుల రద్దీని బట్టి 6వ తేదీ నుంచి వలంటీర్లను నియమించే అంశంపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కర్ణాటక, అనంతపురం ప్రాంతాల నుంచి వలంటీర్లను సమీకరించనున్నట్లు చెప్పారు. కన్నడ భాష తెలిసిన పోలీసు సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి రప్పించేందుకు ఇప్పటికే లేఖ రాసినట్లు వెల్లడించారు. ఆత్మకూరు అటవీ శాఖ డీడీ విఘ్నేష్‌ అపూర్వ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల గుండా వచ్చే పాదయాత్ర మార్గాల్లో ఫైర్‌ వాచర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన పాయింట్ల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కొల్లాబత్తుల కార్తీక్‌, డీఆర్‌ఓ రామునాయక్‌, ఆర్డీఓలు, డిఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో 16 నుంచి ఉగాది ఉత్సవాలు1
1/1

శ్రీశైలంలో 16 నుంచి ఉగాది ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement