చీకటి ఒప్పందంతో ‘సీమ’కు అన్యాయం
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
బొమ్మలసత్రం: తెలంగాణ ముఖ్యమంత్రితో సీఎం చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేసి సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. సాగునీరు అందక రైతులు వలసలు పోతూ.. అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకోపవడం దారుణమన్నారు. నంద్యాలలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 26వ తేదీ శాసనమండలిలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడిని ప్రశ్నించామన్నారు. ఇప్పటి వరకూ ప్రాజెక్ట్‌కు మంజూరైన నిధులు, ఖర్చు చేసిన వాటిపై సమాధానం ఇవ్వాలని అడిగామన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు వివరించాలని కోరితే మంత్రి సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమయం తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తెలంగాణాలో ప్రాజెక్ట్‌లు నిర్మించి కృష్ణా జలాలు తరలించుకుపోతుంటే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి కోసం పోతిరెడ్డిపాడు వద్ద 800 అడుగుల్లో ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణం పనులు నిలిపివేయటం సరైందికాదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ప్రాజెక్ట్‌పై నడుస్తున్న కేసుపై చంద్రబాబుకు ఎందుకు శ్రద్ధ చూపటంలేదో అర్థం కావటంలేదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో సీమకు భవిష్యత్తులో జరగబోయే అన్యాయంపై ఆదివారం కడపలో రౌండ్‌టేబుల్ సమావేశం జరగనుందన్నారు.


