చెంచులకు ఉచిత స్పర్శదర్శనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని శనివారం చెంచులకు కల్పించారు. సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ చెంచు భక్తులు దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశారు. చెంచులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు సమర్పించారు. స్థానిక మేకలబండ, ఇతర గూడేలకు చెందిన చెంచు భక్తులు పాల్గొన్నారు.
సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి వెనక్కు
● ఆ 11 మంది గ్రేడ్–1 వీఆర్వోలే..
కర్నూలు (సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం 11 మంది సీనియర్ అసిస్టెంట్లకు ఇచ్చిన పదోన్నతిని వెనక్కు తీసుకుంది. 2022లో ఉమ్మడి జిల్లాలోని కర్నూలులో నలుగురు, నంద్యాల జిల్లాలో ఏడుగురికి గ్రేడ్–1 వీఆర్వో నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించారు. అయితే వీరు డిపార్ట్‌మెంటల్ పరీక్ష పాస్ కాలేదన్న నెపంతో వారి పదోన్నతిని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ఇన్నాళ్ల వరకు సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేసిన వారంతా తిరిగి గ్రేడ్–1 వీఆర్వోలుగా పనిచేయాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇచ్చిన పదోన్నతిని వెనక్కు తీసుకోవడం అవివేకమని, వారికి మరో అవకాశమిచ్చి డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో పాసయ్యేలా చూడాలని కోరుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు పరిష్కరించకుండా వేధిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన పదోన్నతులను వెనక్కు తీసుకోవడం దారుణంగా ఉందని మండిపడుతున్నారు.


