పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు
కర్నూలు(హాస్పిటల్): ఆహార భద్రత నియంత్రణ విభాగం అధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూ లు నగరంలోని పలు పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. రాజమండ్రిలో పాలకల్తీతో మరణాలు సంభవించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాలను తనిఖీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు కర్నూలులోని సి.క్యాంపులో ఉన్న రామి రెడ్డి తాత మిల్క్ డైరీలో వల్లభ గోల్డ్ మిల్క్‌ను, మాధవనగర్‌లోని పంచముఖి మిల్క్ పార్లర్‌లోని గాయత్రి ఫుల్‌క్రీమ్ మిల్క్‌ను, ఠాగూర్ నగర్‌లోని ఇందుమణి మిల్క్ పార్లర్‌లోని ఆరోక్య టోన్ మిల్క్‌ను, అమ్మ హాస్పిటల్ సమీపంలోని ఎస్‌ఎస్ మిల్క్ పార్లర్‌లో లూజు పాల ప్యాకెట్ పాల ను శాంపిల్స్ తీసి హైదరాబాద్‌లోని ల్యాబోరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మానాయకులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ ఈ తనిఖీల్లో పాల్గొని పాల విక్రయ దారులకు పలు సూచనలు చేశారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు డీబార్
కర్నూలు(సెంట్రల్): రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బుధవారం జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డీబార్ అయ్యారు. కర్నూలు సాయి కృష్ణ , ఆళ్లగడ్డ అనంత డిగ్రీ కాలేజీల్లో ఒక్కొక్కరు చొప్పున డీబార్ అయ్యారు. మరోవైపు డిగ్రీ ఫస్టు సెమిష్టర్ పరీక్షకు 85 శాతం, బీటెక్ పరీక్షలకు 97 శాతం, లా పరీక్షలకు 93 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
మెడికల్ విద్యార్థులు రక్తదానం
కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్యను పూర్తి చేసి త్వరలో మెడిసిన్ పట్టా తీసుకుంటున్న వేళ కర్నూలు మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థులు బుధవారం రక్తదానం చేశారు. ఈ వైద్యవిద్యా ర్థులు త్వరలో ఔట్‌గోయింగ్ బ్యాచ్ ఏఆర్‌ఓకేఏహెచ్–26 పేరుతో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య విద్యార్థులు వైద్యంతో ప్రాణాలు కాపాడటమే గాక రక్తదానంతో కూడా ప్రాణాలు నిలిపేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రతి వైద్య విద్యార్థి ఇలాంటి సంప్రదాయాన్ని పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షెహనాజ్, పెథాలజి అసోసియేట్ ప్రొఫెసర్ శైల, 2కే20 బ్యాచ్ సీఆర్ డాక్టర్ అభిషేక్, అఖిల్, శిరీష, స్వర్ణలత, ప్రవల్లిక, హరినాత్, జైషన్, బాలు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు
నంద్యాల: జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 2026–27 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాజకుమారి బుధవారం అందజేశారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన మొత్తం 508 మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన పాత్రికేయుల అర్హతలను పరిశీలించి, తదుపరి కమిటీ సమావేశంలో వారికి కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
గంజాయి పట్టివేత
నంద్యాల: పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌డీపీఓ మందాజావళి, వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నందమూరినగర్‌కు చెందిన దాసరి కల్యాణ్, బైటిపేటకు చెందిన మనోహర్ గంజాయికి అలవాటుపడ్డారు. ఈక్రమంలోనే వైజాగ్ నుంచి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కేజీ రూ. 4వేలు ప్రకారం గంజాయిని కొనుగోలు చేసి పది గ్రాముల ప్రకారం చిన్నచిన్న ప్యాకెట్లు తయారు చేసి ఒక్కోక్కటి రూ.2 వేలు చొప్పున నంద్యాల పట్టణంలో విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఆ ఇద్దరిపై నిఘా వేసిన పోలీసులు బుధవారం జగజ్జననీ నగర్ చెరువు కట్ట మల్లెలమ్మ గుడి వెనుక ఉండగా దాడి చేసి పట్టుకొని రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు
పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు


