డిగ్రీ పాఠ్యాంశాల్లో సాంకేతికతను జోడించాలి
కర్నూలు(సెంట్రల్): డిగ్రీ కోర్సుల పాఠ్యాంశాలు విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుదిద్దేలా ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య వి.వెంకట బసవరావు ఆకాంక్షించారు. బుధవారం వర్సిటీ సెనేట్ హాలులో అకడమిక్ ఆఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో యూజీ బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ..డిగ్రీ పూర్తయ్యేసరికి విద్యార్థి స్వయం సహాయకంగా ఎదగాలన్నారు. ఈ దిశగా పాఠ్యాంశాలకు సాంకేతికతను మేళవించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్వాంటం కంప్యూటింగ్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా విద్యార్థులకు బోధనాంశాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు పాల్గొన్నారు.


