మాదిగలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

మాదిగలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

Feb 26 2026 7:28 AM | Updated on Feb 26 2026 7:28 AM

మాదిగలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

మాదిగలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

ఏపీ ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు

కర్నూలు(అర్బన్‌): రాష్ట్రంలో మాదిగలపై పెరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి సువర్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లాలోని తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.ఎం.రమేష్‌ హత్యకు నిరసనగా బుధవారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో సభను నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు పేరపోగు వెంకటేశ్వరరావు, బుంగా సంజయ్‌ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సువర్ణరాజు మాట్లాడుతూ జనవరి 31న టి.ఎం.రమేష్‌ను అతి దారుణంగా హత్య చేసినా నేటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో దళితులకు, ముఖ్యంగా మాదిగ బిడ్డలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నా పాలకులు మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్లు కావాలి కాని వారి ప్రాణాలు పోతుంటే పరామర్శించే తీరిక కూడా ప్రభుత్వ పెద్దలకు లేదా అని నిలదీశారు. రమేష్‌ హంతకులకు కఠిన శిక్ష పడేలా చేయాలన్నారు. కేసు విచారణను వేగవంతం చేసేందుకు తక్షణమే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని, బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రమేష్‌ హత్య కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ జాతిని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఛలో అమరావతి కార్యక్రమానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. మాదిగలపై జరుగుతున్న హత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం స్పందించడం లేదన్నారు. అగ్ర వర్ణాలకు చెందిన నాయకులు హత్యలకు గురైతే కోట్ల రూపాయల పరిహారంతో పాటు కోట్లు ఖరీదు చేసే స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదన్నారు. మాదిగ బిడ్డ హోంమంత్రిగా ఉన్నా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు హత్యలకు గురవుతున్నా ఆమె స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పెద్ద మాదిగ అని చెప్పే మందకృష్ణ మాదిగ సైతం మాదిగల హత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమయ్యారన్నారు.

● కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు సోమసుందరం మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కమతం పరుశురాం, సుధాకర్‌ మాదిగ, రాయలసీమ దండోరా అధ్యక్షులు అనంతరత్నం మాదిగ, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకురాలు నాగేశ్వరి మాదిగ, రాష్ట్ర కోకన్వీనర్‌ వెంకటేశ్వర్లు మాదిగ, జిల్లా అధ్యక్షులు పులికొండ మాదిగ, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గద్ద రాజశేఖర్‌ మాదిగ, నగర అధ్యక్షుడు కన్నెమరకల వెంకటేష్‌ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు గిడ్డయ్య మాదిగ, విన్సెంట్‌ విజయ్‌ కుమార్‌ మాదిగ, రంగడు మాదిగ, నవీన్‌ మాదిగ, శాంతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement