రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– బనగానపల్లె ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. బనగానపల్లె పట్టణం కొండపేటకు చెందిన శాలిక శివప్ప (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కోవెలకుంట్లలో ఉన్న బంధువులను చూసేందుకు ఇంటి వద్ద నుంచి బైక్‌పై బయలుదేరాడు. మండలంలోని అమడాల మెట్ట పెట్రోల్ బంక్ సమీపంలో పంక్చరై ఆగి ఉన్న కంకర టిప్పర్‌ను వెనుకవైపు నుంచి బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో యువకుడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మేరి, కుమారుడు మోక్షిత్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శపపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
1,113 పింఛన్ల కోత
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 28నే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి నెల 4,49,792 పింఛన్లు ఉండగా.. మార్చి నెలలో 4,48,679కు తగ్గిపోయాయి. అంటే 1,113 పింఛన్లు కోతపడ్డాయి. పింఛన్ల పంపిణీకి రూ.195.9 కోట్లు విడుదలయ్యాయి.
డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుకు నోటిఫికేషన్
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుకు న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టు(1)కు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. క్రిమినల్ లా ప్రాక్టీసులో ఏడు సంవత్సరాలు, సెషన్స్ కేసులు చేయడంలో అనుభవం కలిగిన న్యాయవాదులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లా కోర్టు వెబ్‌సైట్ https://www.ecourtskurnool.com నందు అప్లికేషన్ అందుబాటులో ఉందన్నారు. మార్చి 10 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులను పంపాలని పేర్కొన్నారు.


