16 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: మార్చి 16వ తేది నుంచి 20వ తేది వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగుతాయని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డా.చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి అన్నారు. బుధవారం కర్ణాటక రాష్ట్రం భాగల్‌కోట్ జిల్లా తేర్‌దాళ్‌లోని అల్లమ ప్రభు దేవస్థానంలో భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ధర్మ ప్రచార రథయాత్ర బసవేశ్వర సర్కిల్ నుంచి అల్లమ ప్రభు దేవాలయం వరకు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పీఠాధిపతి మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలకు శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తుందన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆ సమయంలో అలంకార దర్శనానికే అనుమతిస్తున్నట్లు చెప్పారు. భక్తులు సంయమనం పాటిస్తూ స్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని, ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ కాలిబాటగా వచ్చే భక్తుల సౌకర్యార్థం మంచినీటి సరఫరా, దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


