రాజకీయ ప్రయోజనాల కోసమే లడ్డూపై చర్చ
● చంద్రబాబు తీరుపై వైఎస్సార్‌సీపీ నేత సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం
కర్నూలు (టౌన్): చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసమే అసెంబ్లీలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై చర్చ పెట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. బుధవారం స్థానిక సీ క్యాంపులోని తన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాలన, సంక్షేమంలో వైఫల్యం చెందడంతో తిరుమల లడ్డూపై చంద్రబాబు తన దైన మార్క్ రాజకీయం నడుపుతున్నారన్నారు. దేవుడితో రాజకీయం ఇంకెన్నాళ్లు సాగదీస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచం నలుమూలల్లో ఉన్న హిందూవులు జీవితంలో ఒక్కసారైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని, ప్రసాదం స్వీకరించాలని భావిస్తారన్నారు. లడ్డూపై విష ప్రచారం ద్వారా అలాంటి వారి మనోభావాలను చంద్రబాబు సర్కారు దెబ్బతీస్తుందని మండిపడ్డారు. ఎలాంటి ఆధారం చూపకుండా జంతువుల కొవ్వు కలిపారంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం దుర్మార్గమన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతియాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


