జనగణన గణాంకాలు దేశాభివృద్ధికి పునాది
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(అర్బన్): కచ్చితమైన జనగణన గణాంకాలు దేశాభివృద్ధి ప్రణాళికలకు బలమైన పునాది వంటివని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం పట్టణంలోని అయ్యలూరు మెట్టలో ఉన్న ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన జనగణన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగణన గణాంకాల సమయంలో సమగ్రమైన, పారదర్శక సమాచార సేకరణ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుందన్నారు. ఈ ప్రక్రియలో ప్రతి అధికారి అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని, ఇంటింటి సమాచారాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయాలన్నారు. సేకరించిన గణాంకాల ఆధారంగానే విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం, మౌలిక వసతుల ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా పని చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ – చీఫ్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ డా. జగన్నాథ్ మజ్హి, డిప్యూటీ డైరెక్టర్– డిప్యూటీ చీఫ్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ దిబ్బకర్ బరిహ, జిల్లా ఇన్‌చార్జ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ జి. విష్ణుమాధురి, డైరెక్టరేట్ శిక్షకులు మోహన్ రమణ, అమిత్ సింగ్, దీపక్ భరద్వాజ్, డీఆర్‌ఓ రామునాయక్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.


