మైక్రో ఫైనాన్స్‌ నిర్వాహకుల వేధింపులకు వ్యక్తి బలి | - | Sakshi
Sakshi News home page

మైక్రో ఫైనాన్స్‌ నిర్వాహకుల వేధింపులకు వ్యక్తి బలి

Feb 24 2026 7:41 AM | Updated on Feb 24 2026 7:41 AM

మైక్రో ఫైనాన్స్‌ నిర్వాహకుల వేధింపులకు వ్యక్తి బలి

మైక్రో ఫైనాన్స్‌ నిర్వాహకుల వేధింపులకు వ్యక్తి బలి

ఆత్మకూరులోని వెంగల్‌రెడ్డినగర్‌కు చెందిన కార్పెంటర్‌ రమణ మైక్రో ఫైనాన్స్‌ నిర్వాహకుల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రమణ అల్లుడు గంగాధర్‌ కూడా మామ వద్దే చిన్న చిన్న పనులు చేసుకుంటుంటాడు. గంగాధర్‌ కొంతకాలంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన హరికృష్ణారెడ్డి నిర్వహిస్తున్న హరిహరనాథ్‌ మైక్రోఫైనాన్స్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అప్పులు ఇచ్చి, వసూలు చేయడం అతని పని. కాళహస్తిగౌడ్‌, ఉప్పరి శివ కూడా మైక్రోఫైనాన్స్‌ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. అయితే వసూలు చేసిన డబ్బును గంగాధర్‌ సక్రమంగా చెల్లించకుండా సొంతానికి వాడుకున్నట్టు తెలుస్తోంది. అందులో కొంత చెల్లించినా ఇంకా భారీగా అప్పు పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్‌ వ్యాపారి నుంచి ఒత్తిళ్లు అధికమవడంతో గంగాధర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో హరికృష్ణారెడ్డితో పాటు కాళహస్తిగౌడ్‌, ఉప్పరి శివ, మరో వ్యక్తి ఆచారి డబ్బు కోసం గంగాధర్‌ మామ రమణపై ఒత్తిడి చేస్తున్నారు. కాళహస్తిగౌడ్‌కు ఓ టీడీపీ ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులనూ రంగంలోకి దింపడంతో రమణ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. విధిలేని పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా ఆయన కర్నూలులో డీఐజీని కలిసి మైక్రో ఫైనాన్స్‌ వేధింపులను వివరించారు. స్పందించిన డీఐజీ సంబంధం లేని విషయంలో రమణను వేధించవద్దని స్థానిక పోలీసులను ఆదేశించారు. అయినప్పటికీ మైక్రోఫైనాన్స్‌ వ్యాపారుల వేధింపులు ఆగకపోవడంతో రమణ గత శనివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి రమణ సోమవారం మృతిచెందాడు. రమణ భార్య శారద ఫిర్యాదు మేరకు వెంకటకృష్ణారెడ్డితో పాటు కాళహస్తిగౌడ్‌, శివ, మరో వ్యక్తి ఆచారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement