రీఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: రీ ఓపెన్ అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారులపై నమ్మకంతో ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తారని, వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 53 దరఖాస్తులు ఇంకా ఓపెన్ చేయలేదని, వాటిని తక్షణమే పరిశీలించాలన్నారు. అర్జీదారుల అసంతృప్తి కారణంగా 283 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయన్నారు. అలాంటి అర్జీలపై సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం అందించాలని తెలిపారు. ఇంకా 2,455 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయని, నిర్ణీత గడువులోగా వాటిని పూర్తిచేయాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చిన అర్జీలను కూడా అదే ప్రాధాన్యతతో పరిష్కరించడం అధికారుల బాధ్యతని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలులో స్టేట్ ఫుడ్ లేబొరేటరీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీ ఆవరణలో స్టేట్ ఫుడ్ లేబొరేటరీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)తో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్(సీఎస్‌ఎస్) కింద అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి రూ.19.84 కోట్లను మంజూరు చేసింది.


