నీరు నిలిచి.. బీడువారి!
జూపాడుబంగ్లా/రుద్రవరం: ఖరీఫ్‌లో అధిక వర్షాలతో పంటలు పండక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పైసా నష్టపరిహారం ఇవ్వని చంద్రబాబు సర్కార్ ఇప్పుడు కేసీ కాల్వకు సాగు నీటిని నిలిపివేసింది. దీంతో ఆయకట్టులో పంటలు ఎండిపోతున్నాయి. తుంగభద్రడ్యాం గేట్ల మరమ్మతులంటూ కేసీ కాల్వకు నీరు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్ 2న జరిగిన జిల్లా సాగునీటి సలహామండలి సమావేశంలో కర్నూలు–కడప కాల్వకు రబీ పంటల సాగుకు నీటి సరఫరా విషయమై అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. కేసీ కెనాల్ పరిధిలో 150 కిలోమీటర్ల వరకు 60 వేల ఎకరాల పొలం ఉంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం 82.30 నుంచి 150 కిలోమీటరు వరకు 20వేల ఎకరాల్లో ఆరుతడిపంటలైన మినుము, కంది, మొక్కజొన్న, జొన్న, నువ్వులు, పెసలు, తదితర పంటలను రైతులు సాగుచేసుకున్నారు. ఎకరాకు రూ.30వేల దాకా పెట్టుబడి పెట్టారు. మరో రెండు తడుల నీరు వస్తే దిగుబడి చేతికందుతుందన్న తరుణంలో కేసీ కాల్వకు సాగునీటిని నిలిపివేశారు. ఇప్పటికే వారం రోజులుగా నీరు రాకపోవడం, ఎండల తీవ్రత పెరగడంతో పంటలు వాడుమొహం పట్టాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లెదుటే నీళ్లున్నా (శ్రీశైలం బ్యాక్ వాటర్) సాగుచేసిన పంటలకు పారించుకోలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, ఆత్మకూరు, గడివేముల, బండిఆత్మకూరు, వెలుగోడు మండలాల పరిధిలోని కేసీ ఆయకట్టు పొలాలకు సాగునీటిని ఇవ్వలేని దుస్థితిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో కేసీ కాల్వకు నీరు సరఫరా చేయకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్ర పంటనష్టం చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటనష్టం వాటిల్లితే చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని అన్నదాతలు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
తెలుగుగంగ కింద..
తెలుగుగంగ కాలువ కింద నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని చందలూరు రైతులు వందలాది ఎకరాల్లో వరి సాగు చేశారు. తెలుగుగంగ ద్వారా చందలూరు చెరువును నీటితో నింపడంతో పంట పండుతుందని ఆశించారు. ఇప్పటికే ఒక్కో ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే కాల్వ ద్వారా సాగు నీరు అందకపోవడం, ఎండ తీవ్రంగా ఉండటంతో పొలాలు ఎండి బీటలు వారుతున్నాయి. తెలుగుగంగ కాల్వల ద్వారా రైతులకు సాగు అందుతుందా లేదా అని పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తమకు ఈ పరిస్థితి నెలకొందని చందలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 20వ బ్లాక్ కాల్వ ద్వారా సాగు నీరు అందకపోవడంతో దాదాపు 300 ఎకరాల్లో వరి పంట ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు.
కేసీ కాల్వకు అకస్మాత్తుగా సాగునీటిని నిలిపివేయడం తగదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నీరు నిలిపేస్తే పంటలు ఏం కావాలి. 11 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. రూ.6లక్షల పెట్టుబడి పెట్టాను. మార్చి వరకు సాగు నీరివ్వకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
– దొడ్డాసుధాకర్, రైతు, కనకయ్యకొట్టాల
రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే వెంటనే కేసీ కాల్వకు సాగు నీరివ్వాలి. అధికారులు రబీపంటలకు సాగు నీరు ఇవ్వబోమని స్పష్టంగా చెప్పి ఉంటే మేం పంటలు వేసేవాళ్లం కాదు. కేసీ కాల్వకింద 8 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. మార్చి వరకు నీరిస్తేనే పంట చేతికందుతుంది. లేకపోతే తీవ్రనష్టం కలుగుతుంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి వెంటనే సాగు నీరివ్వాలి. – నాగేంద్రగౌడు, రైతు, తూడిచెర్ల
కేసీ కెనాల్ కింద రబీ పంటలకు
అందని సాగునీరు
తెలుగుగంగ కాలువ కింద ఇదే దుస్థితి
పంటలు చేతికొచ్చే సమయంలో
నీరు నిలిపివేసిన చంద్రబాబు సర్కారు
సాగు నీరివ్వకపోతే ఆత్మహత్యలే
శరణ్యమంటున్న రైతులు
నీరు నిలిచి.. బీడువారి!
నీరు నిలిచి.. బీడువారి!
నీరు నిలిచి.. బీడువారి!


