దేవతలారా రారండి!
ఆళ్లగడ్డ: సత్యలోకానికి సంకేతంగా కోటి సూర్యతేజస్సుతో వెలిగిపోయే గరుడ ఆళ్వార్లను మంత్రపూర్వకంగా ఆహ్వానించే ధ్వజారోహణం.. తనువు, మన స్సు పులకించిపోతుండగా దేవదేవుడి వాహనమైన గరుత్మంతుని ద్వారా దేవతలను ఆహ్వానించే దేవతాహ్వానం కార్యక్రమాలు ఎగువ అహోబిలంలో ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుడి చిత్రపటావిష్కరణ చేశారు. అంతకు ముందు దేవాలయం ఆవరణలో గరుత్మంతుని పల్లకీలో కొలువుంచి ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజ స్తంభం వద్దకు తోడ్కొనివచ్చారు. అక్కడ మొదటి జియర్ ఆదివన్ శఠగోపన్ ఉత్సవ విగ్రహం ఎదురుగా ఉంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలు తరలిరావాలని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేసి మంత్ర పూర్వకంగా పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణానికి ముక్కోటి దేవతలు వస్తారని విశ్వాసం. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఆశీర్వదించేందుకు వచ్చే ముక్కోటి దేవతలతో పాటు, సకుటుంబ సపరివార సమేతంగా తరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా గరుత్మంతుడు కాపలా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం రాత్రి ఎగువ అహోబిలంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఎగువ అహోబిలంలో శాస్త్రోక్తంగా
ధ్వజపటావిష్కరణ
సింహ వాహనంపై విహరించిన
జ్వాలా నరసింహుడు
దిగువ అహోబిలంలో
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
దేవతలారా రారండి!


