కేసీకి తక్షణమే నీటిని విడుదల చేయాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
పగిడ్యాల: కేసీ కాల్వకు తక్షణమే కృష్ణా జలాలు విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రమైన పగిడ్యాలలో కేసీ కాల్వను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీ ఆయకట్టు కింద రబీ సీజన్‌లో ఆరుతడి పంటలకు మార్చి చివరి వరకు సాగునీరు ఇవ్వాల్సిన కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా డిసెంబర్‌లోనే నీటిని నిలిపేయడం దారుణమన్నారు. మార్చి చివరినాటి వరకు కాల్వకు సాగునీటిని విడుదల చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రెండురోజుల్లో నీటివిడుదల చేయకపోతే పైర్లు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. కేసీకి నీటిని విడుదల చేయకపోతే వైఎస్సార్సీపీ అధ్వర్యంలో రైతులతో కలసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. రైతులు ఏటా సాగు కష్టాలను ఎదుర్కొంటు నష్టపోతున్నారన్నారు. ఆయన వెంట మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పుల్యాల నాగిరెడ్డి, సర్పంచ్ పెరుమాల శేషన్న, నాయకులు ఉన్నారు.


