అడుగడుగునా గుంతలు.. అదురుతున్న గుండెలు
ఉయ్యాలవాడ: మోంథా తుపాన్ ప్రభావంతో గత నెల చివరి వారంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. రహదారుల్లో కంకర అంతా లేచిపోయి అడుగడుగునా గుంతల మయం కావడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కోవెలకుంట్ల, జమ్మలమడుగు మధ్య గతంలో నిర్మించిన తారురోడ్డులో అడుగడుగునా గుంతలు కనిపిస్తున్నాయి. ప్రయాణానికి ఆటంకంగా మారింది. ఈ రహదారిలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్‌కు వాహనాలు నిత్యం వందలాదిగా వెళ్తుంటాయి. అలాగే బోడెమ్మనూరు రహదారి పూర్తిగా దెబ్బతిని నరకప్రాయంగా మారింది. గ్రామ సమీపంలోని కుందూనది వంతెన నుంచి కోవెలకుంట్ల, జమ్మలమడుగు ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారి వరకు 8 కిలో మీటర్ల పొడువున అప్పట్లో తారురోడ్డు వేశారు. తరువాత రహదారి మరమ్మతులకు నోచుకోలేదు. ప్రస్తుతం తారంతా లేచిపోయి మట్టిరోడ్డును తలపిస్తోంది. ఉయ్యాలవాడ నుండి ఆర్.పాంపల్లె మీదుగా ఆళ్లగడ్డ వరకు నిర్మించిన రహదారిలో కూడా అక్కడక్కడ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. సంబంధిత శాఖ అధికారులు గుంతలను పూడ్చి రహదారులలో ప్రయాణాలు సురక్షితంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రజలు కోరుతున్నారు.


