ఇసుక.. మస్కా!
● టిప్పర్లతో ఇసుక వ్యాపారం చేస్తున్న
‘కూటమి’ నేతలు
● చోద్యం చూస్తున్న ఏడీఎంఈ, పోలీసు,
రెవెన్యూ, ఆర్‌టీఏ అధికారులు
డోన్: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్నా ‘కూటమి’ నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని పెన్నానది రీచ్‌ల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తమకు ఇష్టం వచ్చిన ధరలతో విక్రయిస్తున్నారు.పేదలు, రైతులు ఇళ్ల నిర్మాణం కోసం సమీపంలోని వంకలు, వాగుల నుంచి ఇసుక తోడి రవాణా చేసుకోవచ్చు అనే ప్రభుత్వం ప్రకటన కేవలం కాగితాల వరకే పరిమితమైంది.
అడ్డుకట్ట పడేదెన్నడు?
డోన్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఇసు‘కాసు’రులు తాడిపత్రి నుంచి ఇసుకను అక్రమ డంపులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే జలదుర్గం, ప్యాపిలి పోలీసు అధికారులు అడపాదడపా టిప్పర్లను ఆపి ఏడీఎంఈ అధికారులకు కేసులు అప్పగించామని చేతులు దులుపుకుంటున్నారు. వంకలు, వాగుల్లో లభించే ఇసుకను రవాణాచేసే ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలను మాత్రం అక్రమంగా నిలిపి వేధించడం పోలీసు, రెవెన్యూ, ఏడీఎంఈ అధికారులకు షరా మామూలుగా మారింది. ఇసుకను డంపులకు తరలించే టిప్పర్లకు ఆర్‌సీలతో పాటు సరైన ధ్రువపత్రాలు కూడా లేవని అధికార పార్టీ నేతలు కొందరు ఆరోపిస్తున్నారు. లైసెన్సులు లేని డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారని అంటున్నా కూడా సంబంధిత అధికారులు ఏనాడు కూడా తనిఖీ చేసిన పాపాన పోలేదు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట పడేదెన్నడని ప్రజలు నిలదీస్తున్నారు.
దోపిడీ ఇలా..
● ఈ ఏడాది ప్రారంభంలో నంద్యాలలో జరిగిన ఇసుక డిపో టెండర్లలో అధికార పార్టీకి చెందిన అసమ్మతి నేత పాల్గొని బినామీ పేరుతో టెండర్లను దక్కించుకున్నారు. ఇసుక డిపోను డోన్‌లో ఏర్పాటు కాకుండా అడ్డుకున్నాడు.
● ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్తకు చెందిన 10 టైర్ల టిప్పర్లను రంగంలోకి దించి టన్నుకు రూ.100 నుంచి రూ.200 వరకు అక్రమంగా అధికార పార్టీ నేత వసూలు చేస్తున్నారు.
● తాడిపత్రి నుంచి రోజూ డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో జరిగే నిర్మాణ పనులకు 15 నుంచి 20 టిప్పర్ల ఇసుకను రవాణా చేస్తున్నారు. ట్రిప్పుకు రూ.3వేల నుంచి రూ.6వేల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు.
● తాము చెప్పిన ప్రాంతానికే, చెప్పిన వ్యక్తికే ఇసుక రవాణా అయ్యేవిధంగా టిప్పర్ యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
● సున్నపు బట్టీల వద్ద ఇసుక డంప్‌ను ఏర్పాటుచేసి నాలుగు టన్నుల ఇసుక రూ.6వేల చొప్పున విక్రయిస్తున్నారు.
ఇసుక.. మస్కా!


