ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కల్లూరు: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. శనివారం తన స్వగృహంలో ఈ నెల 12న నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న ఈ ప్రజా ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తహసీల్దార్ కార్యాలయం దగ్గరకు ర్యాలీగా వెళి తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తామన్నారు. పాణ్యం నియోజవకవర్గంలో తన స్వగృహం నుంచి కల్లూరు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తామన్నారు.
పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసే కుట్ర
రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు 12 మెడికల్ కళాశాలలు ఉండగా వైఎస్సార్‌సీపీ పాలనలో 17 కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయన్నారు. వాటిలో ఐదు కళాశాలలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసే కుట్ర సాగుతోందన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలలతో వేలాది మంది విద్యార్థులకు వైద్య సీట్లు అందుబాటులో వస్తాయన్యానరు. లక్షలాది మందికి సూపర్ స్పెషలిటీ వైద్యం అందుతుందన్నారు.
రైతులందరికీ పంట నష్ట పరిహారం ఇవ్వాలి
మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం అదుకోవాలని కాటసాని కోరారు. క్రాప్ ఇన్స్‌రెన్స్‌తో సంబంధం లేకుండా రైతులకు న్యాయం చేయాలన్నారు. పత్తి, పొగాకు, మిరప, ఇతర పంటల రైతులకు ఆదుకోవాలన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుక, కార్పొరేటర్లు గాజుల శ్వేతారెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, నారాయణరెడ్డి, సాన శ్రీనివాసులు, లక్ష్మిరెడ్డి, నాయకులు హనుమంతురెడ్డి, శివశంకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కేశవరెడ్డి, రంగప్ప, చాంద్‌బాష, అశోక్‌వర్ధన్‌రెడ్డి, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


