వరద నీటి సద్వినియోగంలో విఫలం | - | Sakshi
Sakshi News home page

వరద నీటి సద్వినియోగంలో విఫలం

Aug 3 2025 8:31 AM | Updated on Aug 3 2025 8:31 AM

వరద న

వరద నీటి సద్వినియోగంలో విఫలం

కర్నూలు(అర్బన్‌): ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంలో జల వనరుల శాఖ ఇంజనీర్లు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుత ఖరీఫ్‌లో కూడా పంటలు ఎండిపోయి, తాగునీరు అందని పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. శ్రీశైలంలో 854 అడుగుల మేరకు నీరు ఉంటే పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉన్నా, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో నీటి పారుదల అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ సకాలంలో చర్యలు చేపట్టకపోవడం వల్ల గత మూడు రోజులుగా 20 నుంచి 30 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి విడుదలకు సంబంధించి కేఆర్‌ఎంబీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పలువురు ఇంజనీర్లు చెప్పగా, వరద ప్రవాహాన్ని ముందుగానే అంచనా వేసి ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ? అని ఆయన ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వారు ఏ విధంగా నీటిని వినియోగించకుంటున్నారో మీకు తెలియదా అని ప్రశ్నించారు. మే చివరి నాటికి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులను పూర్తి చేసి ఉంటే, ఇప్పటికే గాజులదిన్నెలో కనీసం మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేది కదా, జూన్‌ నెలాఖరు వరకు కాలువ వైడనింగ్‌, లైనింగ్‌ పనులు చేపట్టడం వల్ల ఇప్పటి వరకు కేవలం 0.2 టీఎంసీల నీరు కూడా జీడీపీకి చేరలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా మనకు అరకొర వర్షాలు కురుస్తున్నా, దేవుని పుణ్యాన ఎగువన వర్షాలు కురవడంతో మనకు వరద నీరు వస్తోందని, అనుకోకుండా వరద నీరు ఆగిపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఇంజనీర్లు చెప్పిన సమాధానాల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

పండ్ల తోటల పెంపకంపై

అవగాహన పెంచాలి

కరువు జిల్లా అనంతపురం నేడు పండ్ల తోటల పెంపకంలో అగ్రగామిగా ఉందని, అన్ని రకాల పండ్లను అక్కడి రైతులు పండిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూధన్‌ చెప్పారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం మిర్చి, ఉల్లి, టమోటా, పత్తి తదితర పంటలపైనే రైతులు మొగ్గు చూపుతున్నారన్నారు. వివిధ రకాల పండ్ల తోటలను సాగు చేసుకునేందుకు ఇక్కడి రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆయా పండ్లకు సంబంధించిన మార్కెటింగ్‌పై కూడా రైతులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు మహేశ్వరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ మద్దన్న, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు బి.నాగేశ్వరరావు, సీహెచ్‌ మనోహర్‌, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణులు బీ రాధిక, చింతామణి, జెడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, సుంకన్న, రఘునాథరెడ్డి, మౌలాలి, ప్రసన్నకుమార్‌, జగదీశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి, శివశంకర్‌రెడ్డి, రామక్రిష్ణ, రంగనాథ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ కూల్చివేతపై చర్యలేవి

బనగానపల్లె పాత బస్టాండ్‌ ప్రాంతంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను కూల్చివేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని చైర్మన్‌ పాపిరెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పనిచేయకుండా చేసి పోలీసుల సాయంతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను కూల్చారనే వాదనలు వినిపిస్తున్నాయని, ఈ ఘటనపై ఏమి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పంచాయతీ అధికారిణి లలితాబాయి మాట్లాడుతూ జరిగిన ఘటనను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని.. అలాగే పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ ఎంపీడీఓ ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేస్తున్నారన్నారు.

సకాలంలో యూరియా అందక ఇబ్బందులు

రైతులకు సకాలంలో యూరియా అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్లాక్‌ మార్కెట్‌లో ఒక బస్తా యూరియాను రూ.500 పెట్టి కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కొత్తపల్లి జెడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి కలుగజేసుకుంటు రబీ సీజన్‌లో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చిన సమయంలోనే రానున్న ఖరీఫ్‌లోనైనా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలని స్థాయీ సంఘ సమావేశాలు, జనరల్‌ బాడీ సమావేశాల్లోను అధికారులను కోరామన్నారు. అయినా, ప్రస్తుత ఖరీఫ్‌లో యూరియా లభించక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

ఇంజనీర్ల నిర్లక్ష్యంతో 20 నుంచి 30 టీఎంసీల నీరు సముద్రం పాలు

సకాలంలో రైతులకు

యూరియా అందక ఇబ్బందులు

మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌

కూల్చివేతపై చర్యలేవి

జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి

వరద నీటి సద్వినియోగంలో విఫలం1
1/1

వరద నీటి సద్వినియోగంలో విఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement