
పొలాల్లో ‘కేబుళ్ల’ బూచోళ్లు!
మూడు సార్లు చోరీ చేశారు
నా మోటారు గత ఏడాది 3 సార్లు విద్యుత్ వైర్లు కోసి చోరీ చేశారు. ప్రతి సారి దాదాపు రూ. 5 వేలు ఖర్చు వస్తోంది. పైర్లను నీరు పట్టే సమయంలో గత నెల 3వ తేదీన విద్యుత్ వైర్లను అపహరించారు. ఎన్ని సార్లు దొంగతనాలు జరుగుతాయో.. మా రైతు పరిస్థితి ఇంతే!
– గాలి వెంకట సుబ్బారెడ్డి
పోలీసులు స్పందించాలి
గతేడాది 20 మీటర్ల చొప్పున నాలుగు సార్లు కేబుల్‌ను కోశారు. ప్రతి సారి 20 మీటర్లు కొత్త వైర్ వేసుకున్నాను. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే దొంగలించడం ప్రారంభించారు. ప్రతి సారి నాకు రూ. 5 వేలు ఖర్చు వస్తోంది. పోలీసులు స్పందించి దొంగలను అరెస్ట్ చేయాలి.
–బోయ నాగరాజు
● వ్యవసాయ మోటార్ల వద్ద
విద్యుత్ కేబుళ్ల చోరీ
● పైర్లకు నీరు అందకు
రైతుల ఇబ్బందులు
● దొంగలను అరెస్ట్ చేయని పోలీసులు
● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
సంజామల: వర్షాలు అరకొర పడుతున్నాయి. భూగర్భ జలాలతో పంటలు పండిద్దామనుకుంటే దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద కేబుళ్లను చోరీ చేస్తున్నారు. సకాలంలో నీరు అందక పైర్లు ఎండిపోతున్నాయి. వ్యయప్రయాసలకు ఓర్చలేక ఎండిపోయిన పైర్లను చూసి రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కేబుళ్ల దొంగలను అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.
నిత్యం చోరీలే..
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తూ వస్తోంది. అయితే విద్యుత్ మోటార్ల వద్ద నిత్యం చోరీలే జరుగుతుండటంతో రైతులకు ఉచిత విద్యుత్ అందని పరిస్థితి నెలకొంది. గత ఏడాది సంజామల మండలంలోనే మూడు సార్లు విద్యుత్ వైర్లు చోరీకి గురయ్యాయి. నంద్యాల జిల్లాలో ని మిగతా మండలాల్లోనూ వ్యవసాయ మోటార్లను అపహరించుకుని వెళ్తున్నారు. జిల్లాలో బోర్లు, బావుల కింద వ్యవసాయం చేసే గ్రామాల్లో 50 మంది వరకు రైతులు బాధితులుగా ఉన్నారు. చోరీకి గురైన కేబుళ్ల కన్నా వందల అడుగులో ఉన్న మోటార్లను బయటికి తీయడంతో రూ.15 వేల వరకు ఖర్చు వస్తోందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టాలు.. కన్నీళ్లు!
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వర్షాలు ఆశించిన మేర లేకపోవడం.. కాపర్ వైర్ల చోరీ జరుగుతుండటంతో రైతులకు కష్టాలు చుట్టుముట్టాయి. విద్యుత్ మోటార్ల వద్ద కేబుళ్లు తరుచుగా చోరీకి గురవుతుండటంతో కన్నీళ్లు మిగులుతున్నాయి. సంజామల మండలం రెడ్డిపల్లె గ్రామంలో 20 రోజుల క్రితం మోటార్ల విద్యుత్ తీగలతో పాటు రైల్వే ట్రాక్ పనులకు చెందిన దాదాపు రూ.6 లక్షల గల కాపర్ విద్యుత్ వైర్లను దొంగలించారు. రాంకో ఫ్యాక్టరీ యాజమాన్యం సంజామల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆకుమల్లలో గ్రామంలో గత ఏడాది 30 మంది రైతుల వ్యవసాయ విద్యుత్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. గత నెల 3వ తేదీ గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ ఉస్సేనికి చెందిన రూ.32 వేలు వ్యవసాయ మోటార్ అపహరణ అయ్యింది. పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు అందినా ఇప్పటి వరకు దొంగలను అరెస్ట్ చేయలేదు.

పొలాల్లో ‘కేబుళ్ల’ బూచోళ్లు!

పొలాల్లో ‘కేబుళ్ల’ బూచోళ్లు!