
టీడీపీ నేత దాష్టీకంపై సమగ్ర విచారణ
ఆళ్లగడ్డ: చాగలమర్రి డిప్యూటీ ఎంపీడీఓ తాహిర్ హుస్సేన్‌పై టీడీపీ నేత చల్లా నాగరాజు దాష్టీకం చేయడంపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలంటే ఇది అత్యవసరం అని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి లలితాభాయ్‌ని నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశింశారు. సమగ్ర విచారణ చేసి వారం లోపు నివేదిక అందజేయాలని చాగలమర్రి ఎంపీడీఓకు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి సూచించారు. ఈ ఘటనపై గత నెల 17వ తేదీ సాక్షి దినపత్రికలో ‘పీక నొక్కి.. పిడిగుద్దులు గుద్ది’ అన్న శీర్షికన వార్త ప్రచురితమైంది. ప్రభుత్వ అధికారిపై టీడీపీ నేత దాడి చేసిన విషయాన్ని ఎమ్మెల్యే అఖిలప్రియకు ఎంపీడీఓ తెలపగా ‘నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయాలంటే ఇలాంటివి ఈజీగా తీసుకోవాల్సిందే’ అని వార్నింగ్ ఇచ్చారు. అయితే రాష్ట్ర ఆల్ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ఆల్‌ఎంఈడబ్లూఏ), నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సమస్య తీవ్రంగా మారింది. అయితే ఎంపీడీఓ నివేదిక ఇచ్చే విషయం చర్చనీయాంశంగా మారుతోంది.