కాంగ్రెస్‌లో కమిటీల చిచ్చు! | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో కమిటీల చిచ్చు!

Jul 10 2026 7:52 AM | Updated on Jul 10 2026 7:52 AM

తుంగతుర్తిలో ఘర్షణ మునుగోడులో అంతర్గత అసంతృప్తి కోదాడలో సీనియర్ల కినుక..

నిడమనూరులో వర్గపోరు

మిర్యాలగూడలో కొలిక్కిరాని కమిటీ

కొండమల్లేపల్లిలో గుంభనంగా నేతలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ మండల కమిటీల అధ్యక్షుల నియామకాలు ఆ పార్టీలో వర్గ పోరుకు తెరలేపాయి. పాత, కొత్త కాంగ్రెస్‌ నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నేతల అనుచరుల మధ్య ఉన్న విభేదాలు.. ఈ నియామకాలతో బహిర్గతమయ్యాయి. పలు మండలాల్లో బహిరంగంగానే నిరసనలు, ఘర్షణలు చోటు చేసుకోగా మరికొన్ని మండలాల్లో అంతర్గతగా అసంతృప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.

తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, తుంగతుర్తి, నూతనకల్‌, మద్దిరాల, నాగారం, జాజిరెడ్డిగూడెం, అడ్డగూడూర్‌, మోత్కూర్‌ మండలాలకు నియమించిన పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మందుల సామేల్‌ వర్గానికే చెందిన వారని సీనియర్‌ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే వైఖరిని అధిష్టానానికి వివరించేందుకు కొందరు నాయకులు, కార్యకర్తలు బుధవారం గాంఽధీభవన్‌కు వెళ్తుండగా అర్వపల్లిలో ఎమ్మెల్యే అనుచరులు, సీనియర్‌ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం గాంఽధీ భవన్‌ వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారిని కాకుండా ఇటీవల తనతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేసి మండల అధ్యక్షులుగా నియమించారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి, దివంగత దామోదర్‌రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యేపై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ మాత్రం.. మండల అధ్యక్షుల నియామక విషయంలో ఏకాభిప్రాయం కుదిరాకే ప్రకటించాల్సి ఉందని ఇటీవల టీపీసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి సూచించిన వ్యక్తికి కూడా మండల అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో కూడా ఆందోళనకు కారణమైంది.

● మద్దిరాల మండలంలో గతంలో అధ్యక్షుడిగా ఉన్న ముక్కాముల అవిలమల్లుయాదవ్‌ స్థానంలో పచ్చిపాల వెంకన్నయాదవ్‌ను నియమించారు. వెంకన్న యాదవ్‌.. ఎమ్మెల్యే సామేల్‌తో గతంలో బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసిన వ్యక్తి కావడంతో ఎమ్మెల్యే తన అనుచరుడికే పదవి కట్టబెట్టాడని సీనియర్లు ఆరోపిస్తున్నారు. సీనియర్‌ నాయకుడు మార్త కృష్ణమూర్తిని అధ్యక్షుడిగా చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● మోత్కూర్‌ మండల అధ్యక్షుడిగా రాచకొండ బాలరాజు నియామకాన్ని ముసిపట్ల గ్రామానికి చెందిన తండ సత్తయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని తీసుకోకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా అధ్యక్షుడిని నియమించారని ఆరోపించారు.

మునుగోడు మండలంలో బహిరంగంగా ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకపోయినా.. మండల అధ్యక్షుడి ఎంపికపై కొందరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ కోసం పని చేసిన నాయకుడికే పదవి ఇవ్వడంతో.. రాజగోపాల్‌రెడ్డి వెంట బీజేపికి వెళ్లి తిరిగి వచ్చిన వారికి అవకాశం లేకపోవడం కొందరికి నచ్చ లేదని తెలుస్తోంది.

కోదాడ నియోజకవర్గంలో ఒకేసారి నాలుగు మండలాల అధ్యక్షులను మార్చడం పార్టీలో చర్చనీయాంశమైంది. కనీస సమాచారం ఇవ్వకుండా మార్చడంతో సీనియర్‌ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అదే విధంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఒంటిపులి వెంకటేష్‌ను కోదాడ పట్టణ అధ్యక్షుడిగా నియమించడం కూడా పార్టీలో చర్చకు దారితీసింది. బయటకు ఎవరు స్పందించకపోయినా లోలోపల అసంతృప్తి వ్యక్తమవుతోంది.

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని నిడమనూరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నర్సింగ్‌ విజయ్‌కుమార్‌గౌడ్‌ను నియమించడంతో అక్కడ వర్గపోరు బయటపడింది. మొదట మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నందికొండ రామేశ్వరి మట్టారెడ్డి పేరును మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రతిపాదించినప్పటికీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంకతి సత్యం చొరవతో ఊట్కూరు గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌కు పదవి దక్కింది. పార్టీ నిబంధనల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళకు మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని ఉన్నప్పటికి విస్మరించారని రామేశ్వరి మట్టారెడ్డి వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీలో విభేదాల కారణంగా ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి కూడా నిడమనూరు మండల కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది.

ఫ కొత్త అధ్యక్షుల నియామకంతో

వర్గపోరు బహిర్గతం

ఫ అర్వపల్లిలో కొట్టుకున్న కార్యకర్తలు

ఫ మిగతా మండలాల్లోనూ

అంతర్గత అసంతృప్తి

ఫ ఎమ్మెల్యేల ఆధిపత్యంపై నిరసనలు

మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ వర్గాల మధ్య విభేదాల కారణంగా ఇప్పటికీ కొన్ని మండల కమిటీల ఏర్పాటు కొలిక్కి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దామరచర్ల, మిర్యాలగూడ రూరల్‌, టౌన్‌ కమిటీలో ఇరువర్గాలు పోటీపడుతున్నాయి.

దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి నియామకంలో రెండు వర్గాల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎమ్మెల్యే నిర్ణయంతో మాజీ ఎంపీపీ దూదిపాల రేఖశ్రీధర్‌రెడ్డి వర్గానికి చెందిన నేతలకు పదవి కేటాయించినట్లు చర్చ జరగుతోంది. దీంతో పార్టీలో పలువురు నాయకులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ బహిరంగంగా స్పందించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement