నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 43 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయనకు వినతులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థుల నమోదు పెంచాలి
దేవరకొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ కె.లింగయ్య కోరారు. సోమవారం దేవరకొండ మండల పరిధిలోని కస్తూరాబా పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరు వంటి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో తరగతి గదులు, మౌలిక వసతుల కల్పన వంటి వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఈఓ సుశీందర్‌రావు, హెచ్‌ఎం పాత్లావత్ శ్రీను, ఉపాధ్యాయులు సయ్యద్, వెంకట్‌రెడ్డి, వినోద, దామోదర్, సత్యనారాయణ, క్రాంతి తదితరులు ఉన్నారు.
గురుకుల జూనియర్ కళాశాలలో్ల స్పాట్ అడ్మిషన్లు
రామగిరి(నల్లగొండ) : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని జూనియర్ కళాశాలల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బి.సంధ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కళాశాలల్లో బైపీసీలో మిగిలిన నాలుగు సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెన్త్‌లో కనీసం 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన బాలురు ఈ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు మిర్యాలగూడ రోడ్డులోని ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో నెల 24, 25 తేదీల్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.
నార్కట్‌పల్లి పోలీసులకు డీజీపీ అభినందన
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి పోలీసులను డీజీపీ అభినందించారు. ఆదివారం నీట్ రాసేందుకు వివిద ప్రాంతాల నుంచి ఎంజీ యూనివర్శిటీకి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పలువురు విద్యార్థులు యూనివర్సిటీ గేటు నుంచి కాలినడకన సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. గమనించిన నార్కట్‌పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి పోలీసుల ద్విచక్రవాహనాలు, పెట్రోలింగ్ వాహనాల్లో విద్యార్థులను పరీక్ష కేంద్రం వద్దకు తరలించారు. ఈ సంఘటన వీడియోను స్థానికులు ఎక్స్ ఖాతాలో డీజీపీ సీవీ ఆనంద్‌కు ట్యాగ్ చేశారు. స్పందించిన డీజీపీ నార్కట్‌పల్లి పోలీసుల సేవలను గుర్తించి అభినందించారు. వీరు అవార్డులకు అర్హులని ఎక్స్‌లో రాసుకొచ్చారు.


