స్తంభాల్లో నాణ్యత లేదు..
మిర్యాలగూడ: కొద్దిపాటి ఈదురు గాలులకే విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. ఇవి నేలకొరుగుతుండడంతో ఒకవైపు ప్రమాదాలు జరుగుతుండగా, మరోవైపు ట్రాన్స్‌కోకు భారీగా నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం తెలంగాణ స్టేట్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్‌పీడీసీఎల్)కు కాంట్రాక్టర్లు విద్యుత్ స్తంభాలను సరఫరా చేస్తుంటారు. వీటిని ట్రాన్స్‌కో ద్వారా పనులు చేపట్టేందుకు సదరు కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. అధికారులు సూచించిన నిబంధనల ప్రకారం స్తంభాలను నాటి, విద్యుత్ తీగలను బిగించి వినియోగదారులకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇలా ఏర్పాటు చేసిన స్తంభాలు కొద్దిరోజులకే, స్వల్ప గాలులకే విరిగిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేల సంఖ్యలో విరిగిన స్తంభాలు
ఇటీవల ఈదురుగాలులకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా సుమారు 2 వేల విద్యుత్ స్తంభాలు నేల కూలినట్లు తెలిసింది. దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో సుమారు 600 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి–సాగర్, మాడ్గులపల్లి, వేములపల్లి ప్రాంతాల్లో మరో 1400 వరకు స్తంభాలు నేలమట్టమయ్యాయి.
క్యూరింగ్ లోపమే కారణమా?
భారీ ఈదురుగాలుల వల్లే ఈ నష్టం జరుగుతోందని అధికారులు చెప్తున్నప్పటికీ, స్తంభాల తయారీలో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిమెంట్ కాంక్రీట్‌తో అచ్చు వేసిన అనంతరం స్తంభాలను కనీసం 20 రోజుల పాటు క్యూరింగ్ (నీటిలో నానేలా) ఉంచాల్సి ఉంటుంది. కానీ, కాంట్రాక్టర్లు వారం లోపే వాటిని తెచ్చి వాడేస్తుండడం వల్లే ఈ పరిస్థితి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.
బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం
స్తంభాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్లే, వారు నాణ్యత లేని మెటీరియల్‌ను వాడుతున్నట్లు వినియోగదారులు చెప్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యత లేని స్తంభాలను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
డివిజన్ వ్యాప్తంగా ఇటీవల సుమారు 2వేల స్తంభాలు విరిగినట్లు తమ దృష్టికి వచ్చింది. హన్మకొండ, వరంగల్ నుంచి సరఫరా అయ్యే స్తంభాల్లో నాణ్యత ప్రమాణాలు లేనట్లు గుర్తించాం. వీటిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. విరిగిన స్తంభాల స్థానంలో తక్షణమే కొత్తవి ఏర్పాటు చేస్తాం.
– శ్రీనివాస్, విద్యుత్ శాఖ డీఈ, మిర్యాలగూడ
మిర్యాలగూడ డివిజన్‌లో ఇటీవల 2 వేల స్తంభాలు నేలమట్టం
ఫ నాణ్యతా లోపమే కారణమంటున్న రైతులు, అధికారులు


