నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్‌లో పంటల సాగుకు రైతులు సన్నద్ధవుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి 30వ తేదీ వరకు రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళాలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న, వినియోగదారుడు ఇష్టపడే తక్కువ కాలపరిమితి కలిగిన నాణ్యమైన సన్న వరి రకాలను ప్రోత్సాహించడం, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగును, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించడం విత్తన మేళా ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రైవేట్ విత్తన వ్యాపారులు, వారు ఎన్నిక చేసుకున్న రైతు వేదికల్లో విత్తనాలను అమ్మకానికి ఉంచుతారు.
ఏడు రకాల సన్నాలకే బోనస్
వరి సన్న రకాల్లో బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 7715, డబ్ల్యూజీఎల్44, జైశ్రీరాం ఈ రకాలకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విత్తనాలతోపాటు పంట మార్పిడిలో భాగంగా కంది, పెసర, మినుములు, నువ్వులు, కూరగాయల విత్తనాలను అమ్మకానికి ఉంచుతారు. యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వాడకాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించేందుకు నానో యూరియాను కూడా రైతు వేదికల్లో అందుబాటులో ఉంచుతారు. మంగళవారం జిల్లాలోని 33 మండలాల్లో ఒక్కో రైతు వేదికల్లో అధికారికంగా విత్తన మేళాను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 140 రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహిస్తారు. రైతులంతా ఈ విత్తన మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌కుమార్ కోరారు.
ఫ అమ్మకానికి విత్తనాలు, నానో యూరియా
ఫ పంట మార్పిడిని ప్రోత్సహించడమే లక్ష్యం


