నగర ప్రజల భద్రతే మా కర్తవ్యం
నల్లగొండ టూటౌన్ : ప్రస్తుత వర్షాకాలంలో వరద ప్రభావం వల్ల అత్యవసర సమస్యలు ఏర్పడితే వాటిని వెంటనే పరిష్కరించేలా నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 24 గంటల పాటు నగర ప్రజలకు అత్యవసర సేవలందించేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భారీ వర్షాలకు వచ్చే వరదల కారణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రెస్క్యూ బృందాలను నియమించింది. గతంలో రాత్రికి రాత్రే కురిసిన భారీ వర్షానికి నీలగిరి నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు వరద ప్రభావిత కాలనీలకు వెంటనే ప్రత్యేక బృందాలను పంపించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.
సమస్యను తెలిపేందుకు కంట్రోల్ రూమ్
నగరంలో భారీగా ఈదురు గాలులు, భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, రోడ్లపైనే పడిపోయి రాకపోకలకు అంతరాయం కలగడం లాంటివి తరచుగా జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగితే వెంటనే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్‌కు సమాచారం అందిస్తే మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, గోడలు కూలినా తక్షణమే అధికారులు స్పందించి ప్రజలకు తగిన తోడ్పాటు అందించనున్నారు. డ్రెయినేజీలు పొంగడం, నీటి నిల్వ చేరడం, రోడ్లు దెబ్బతినడం లాంటివి జరిగితే తక్షణ చర్యలు తీసుకుంటారు.
అందుబాటులో 150 సిబ్బంది
ప్రస్తుత సీజన్‌లో ఏ క్షణంలోనైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అనుకోకుండా కురిసే భారీ వర్షాలకు నగరంలో ఉన్న మూడు గుట్టల నుంచి వరద నీరు వివిధ కాలనీలను ముంచెత్తే ప్రమాదముంది. రోజంతా ఓ మోస్తరుగా వర్షం కురిసినా పెద్దగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. ఒకవేళ రెండు, మూగు గంటల పాటు కుండపోత వర్షంకురిస్తే నగరంలోని చాలా కాలనీలకు వరద ముంపు పొంచి ఉంటుంది. ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో భారీ వర్షాలు కురిసిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లాంటివి జరుగకుండా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ముందస్తుగా చర్యలు చేపట్టింది. వార్డు అధికారులు, శానిటేషన్ జవాన్లు, తాగునీటి సరఫరా సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, హరితహారం సిబ్బంది, టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు, రెవెన్యూ, శానిటేషన్ విభాగల అధికారులతో కలిపి 150 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఈ బృందాలు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తారు.
ఫ వర్షాకాలం నేపథ్యంలో
‘నీలగిరి’ యంత్రాంగం అప్రమత్తం
ఫ కార్యాలయంలో 24 గంటల
కంట్రోల్ రూమ్
ఫ అత్యవసర సేవలకూ ప్రత్యేక రెస్క్యూ బృందాలు
ఆపద వస్తే ఫోన్ చేయాల్సిన నంబర్ 08682–220100
నగర ప్రజల భద్రతే మా కర్తవ్యం. భారీ వర్షాలు కురిసి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజల కోసం 24 గంటల పాటు మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే సిబ్బంది అక్కడికి వచ్చి సమస్య పరిష్కరిస్తారు.
– బి.శరత్‌చంద్ర,
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్


