మునుగోడు : రైతులకు యూరియా సులభంగా అందించాలనే ఉద్దేశంతో అధికారులు రైతువేదికల్లో విక్రయాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాలో 40 రైతు వేదికలను ఎంపిక చేశారు. రైతు వేదికల్లో పీఏసీఎస్ ద్వారా మాత్రమే యూరియా విక్రయాలు సాగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఈ నిర్ణయం ఆచరణలో మాత్రం అనేక సమస్యలకు దారితీస్తుందని రైతులు, సహకార సంఘాల అధికారులు చెప్పుతున్నారు.
మొత్తం 148 రైతు వేదికలు
ప్రభుత్వం క్లస్టర్‌కు ఒకటి చొప్పున ఐదేళ్ల ఏండ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా మొత్తం 148 రైతు వేదికలు నిర్మించింది. వాటిలో 40 రైతు వేదికల్లో యూరియా విక్రయించనున్నారు. అందులో ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలు అధికంగా ఉన్న మండలాల్లో ఒకటి, పర్టిలైజర్ దుకాణాలు తక్కువగా ఉన్న మండలాల్లో రెండు చొప్పున ఎంపిక చేశారు. ఎంపిక చేసిన రైతు వేదికలు చాలా వరకు గ్రామానికి దూరంగా ఉన్నాయి. కొన్ని రైతు వేదికల్లో విద్యుత్ సౌకర్యం లేదు. కొన్నింటికి సరైనా రోడ్డు మార్గం లేదు. సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నా పర్వేలేదు, కానీ గ్రామానికి దూరంగా ఉండటంతో ఆ యూరియాకి భద్రత ఎవరుంటానే ప్రశ్న బలంగా వినిపిస్తోంది.
అదనపు సిబ్బంది అవసరం
వ్యవసాయ శాఖ ద్వారా రైతు వేదికలను యూరియా విక్రయానికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధికారులకు అప్పగిస్తే ఆ అధికారులే యూరియా నిల్వచేసి ఏఈఓలు చెప్పిన రైతులకు యూరియా విక్రయించాలి. రైతు వేదికల్లో యూరియా విక్రయానికి అదనపు సిబ్బంది అవసరం. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సహకార సంఘాలకు రైతు వేదికల్లో యూరియా విక్రయించడం ద్వారా మరిన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఏఈఓలు సైతం రైతు వేదికల్లో యూరియా విక్రయాలు కొనసాగిస్తే తమకు కూడా ఇబ్బందిగా ఉంటుందనే భావనలో ఉన్నారు.
ఫ యూరియా విక్రయానికి
40 రైతు వేదికల ఎంపిక
ఫ రైతు వేదికల్లో అరకొర వసతులు


