ప్రస్తుత వీబీజీ రామ్‌జీ గతంలో ఉపాధి హామీ పథకంగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు అనుమతి ఉండగా, వీబీజీ రామ్‌జీలో తొలగించారు. అప్పట్లో ఆ పనుల కింద 90 రోజుల పనిదినాలు కల్పించే వారు. ప్రస్తుతం అవి లేకపోవడం, మరోవైపు పథకం అమలుకు రాష్ట్రాల నుంచి అదనంగా ప్రతిపాదనలను కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను చేర్చాలని ప్రతిపాదించింది. అలాగే కూరగాయల పందిరి సాగుకు కూడా చేర్చాలని పేర్కొంది. వాటిని చేర్చితే గ్రామీణ ప్రజలకు మరింత మేలు చేకూరనుంది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రామ్‌జీ) అమలులో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మెరుగైన ప్రగతి సాధిస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆమోదించిన 68.09 లక్షల పనిదినాల లేబర్ బడ్జెట్‌లో 41.08 లక్షల పనిదినాలు పూర్తిచేసి, 60.33 శాతం లక్ష్యాన్ని సాధించింది. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు వ్యవసాయ రంగానికి మేలు చేసే పనులను వేగంగా చేపడుతోంది. జిల్లాలో 33 మండలాలు, 868 పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. మొత్తం 3.52 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 7.31 లక్షల మంది కార్మికులు నమోదయ్యారు. ప్రస్తుతం 2.14 లక్షల క్రియాశీల జాబ్ కార్డులు, 3.68 లక్షల మంది క్రియాశీల కార్మికులు ఉన్నారు.
ఉపాధి అవకాశాలు మెరుగు
ఉపాధి హామీ పనుల్లో మహిళల భాగస్వామ్యం బాగా పెరిగింది. మొత్తం పనిదినాల్లో మహిళల వాటా 66.49 శాతంగా నమోదైంది. అందులో ఎస్సీ కార్మికుల పనిదినాలు 16.69 శాతం, ఎస్టీల పని దినాలు 24.74 శాతంగా ఉన్నాయి. దీంతో ఆయా వర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.
కుటుంబాలకు భరోసా
ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు నెలల్లో ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి సగటున 28.36 రోజుల ఉపాధి లభించింది. ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.301.72 వేతనం అందుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరగడంతో వలసలు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు.
రూ.154 కోట్ల వ్యయం
ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో ఉపాధి పనులకు సంబంధించి రూ.154.03 కోట్ల వ్యయం జరిగింది. ఇందులో రూ.123.36 కోట్లు కార్మికుల వేతనాలకే ఖర్చు చేయగా, రూ.28.89 కోట్లు మెటీరియల్, నైపుణ్య కార్మికుల ఖర్చులకు వెచ్చించారు. పాలనా వ్యయం రూ.1.77 కోట్లుగా నమోదైంది.
వ్యవసాయాభివృద్ధి ప్రాధాన్యం
జిల్లాలో పనుల సంఖ్య 41 వేలకుపైగా ఉండగా, ఈ ఏడాది 555 పనులు పూర్తయ్యాయి. మొత్తం వ్య యంలో 40.6 శాతం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల పనులపైనే ఖర్చు చేయడం విశే షం. చెక్‌డ్యాంలు, ఫార్మ్‌పాండ్లు, నీటి సంరక్షణ, భూ సార అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
చెల్లింపుల్లో పారదర్శకత
ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జిల్లాలో పురోగతి కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 100 శాతం చెల్లింపులు ఈ–ఎఫ్‌ఎంఎస్ విధానం ద్వారా జరగగా, 15 రోజుల్లోపు చెల్లింపులు వంద శాతంగా నమోదైంది.
ఫ మూడు నెలల్లోనే 41 లక్షల పనిదినాలు
ఫ ఇప్పటికే పూర్తయిన పనులు 555
ఫ ఇళ్ల నిర్మాణాలకు అనుమతిస్తే పెద్ద ఎత్తున పనులు


