క్షేత్రస్థాయిలో అవగాహన..
సీజనల్ వ్యాధులపై గ్రామాలు, పట్టణాల్లో తమ సబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి నీటి తొట్లు, నీళ్ల ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటా సర్వే నిర్వహించి వారి ఇంట్లో ఎవరైనా జ్వరంతో, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారా అని తెలుసుకుని అవసరమైన మందులు ఇస్తారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌హెల్త్ సెంటర్లు, పల్లె, బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాం. ఎలాంటి మందుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
నల్లగొండ టౌన్ : ‘వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాం. వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా’ అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.రాహుల్ తెలిపారు. వర్షాకాలంలో వ్యాధులకు నియంత్రణకు చేపట్టిన చర్యలపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాటాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
వ్యాధులు వ్యాపించే సీజన్..
వర్షాకాలంలో దోమలు, ఈగల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాగునీరు కలుషితమవుతుంది. వర్షాల కారణంగా పరిసరాల అపరిశుభ్రంగా మారుతాయి. దీంతో మలేరియా, మెదడువాపు, ఫైలేరియా, చికున్‌గున్యా, డెంగీ, డయేరియా, కలరా, టైఫాయిడ్, స్వైన్‌ఫ్లూతో పాటు వివిధ రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. వాటిని అధిగమించడానికి వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల చర్యలు చేపట్టాం. గ్రామాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం, మురుగునీటి గుంటల్లో మట్టి పోయించడం వంటి పనులకు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తాం.
ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు
ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వేలైన్స్ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాల్లో ఫిజీషియన్, పిడియాట్రిక్ పాటు మరో ఇద్దరు వైద్యులు, ఏఎన్‌ఎం, ఎల్‌టీలు, ఆశ వర్కర్లు ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలితే ఈ బృందం వెంటనే అక్కడికి చేరుకుని వైద్య సేవలను అందిస్తుంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు, సిబ్బందిని స్థానికంగా ఉండాలని ఆదేశించాం. స్థానికంగా ఉండని సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. పీహెచ్‌సీల వారీగా రోజూ నివేదికలు తెప్పించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి..
వర్షాకాలంలో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పరిసరాల్లోని నీటి గుంటలు ఉండే వాటిలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆహర పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వేడి పదార్థాలను బుజించాలి. తాగునీటి ట్యాంకుల్లో క్లోరిన్ బిల్లలు చేసుకోవాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.
ఫ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం
ఫ సిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం
ఫ పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం
డీఎంహెచ్‌ఓ
డాక్టర్ కె.రాహుల్


