15.5 ఎకరాల్లో క్రీడా మైదానాలు
నిడమనూరు: నిడమనూరు మండల పరిధిలోని ఊట్కూరులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ (సమీకృత పాఠశాల) భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను రూ.220 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ భవన నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ఊపందుకోవడంతో భారీ సంఖ్యలో ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది, నిర్మాణ కార్మికులు ఊట్కూరుకు చేరుకున్నారు.
21.5 ఎకరాల చదునైన భూమి సేకరణ
పాఠశాల నిర్మాణం కోసం ఊట్కూరులోని సర్వే నంబరు 354లో గల 12.5 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు, దానికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 358, 361లలో మరో 9 ఎకరాల ప్రైవేట్ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. ఎకరాకు రూ.23.5 లక్షల చొప్పున పరిహారం తీసుకునేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియ సజావుగా ముగిసింది. గతంలో నాగార్జునసాగర్‌లో ఈ స్కూల్ నిర్మించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ, స్థలం అనుకూలంగా లేకపోవడంతో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే జైవీర్ కలిసి ఊట్కూరులోని ఈ చదునైన స్థలాన్ని పరిశీలించి ఖరారు చేశారు.
కార్మికుల కోసం తాత్కాలిక నివాస గృహాలు
వర్షకాలంలో పునాదులు, పిల్లర్ల గుంతల్లో నీరు చేరి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు నిర్మాణ సంస్థ పిల్లర్ల పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన పరిపాలన భవనానికి సంబంధించిన పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. పనుల నిమిత్తం ప్రత్యేక విద్యుత్ లైన్లు, నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కార్మికుల కోసం తాత్కాలిక నివాస గృహాల నిర్మాణం కూడా పూర్తయింది.
ఫ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచిన అధికారులు
ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో కేజీ నుంచి పీజీ వరకు 2600 మంది విద్యార్థుల సరిపడేలా తరగతి గదులు, లైబ్రరీలు, ల్యాబ్‌ల నిర్మాణ చేపట్టనున్నారు. ప్రధానంగా విద్యాలయ భవనాలు జీ ప్లస్ 3 నమునాలో 5.5 ఎకరాల్లో నిర్మాణ పనులు పిల్లర్ పనులు వేగంగా చేస్తున్నారు. జీ ప్లస్ 2 నమూనాలో 2 అకాడమిక్ భవనాలు, 68 అడుగుల వైశాల్యంతో భవనాలు నిర్మిస్తారు. పరిపాలన భవనం, గ్రంథాలయం, వంటశాల, డార్మెటరీ జీ ప్లస్ 1 నమునాలో 80 వేల చదరపు అడుగుల వైశాల్యంతో భవనాలు నిర్మిస్తారు. అదేవిధంగా విద్యార్థుల హాస్టల్, ఉపాధ్యాయుల నివాసానికి జీప్లస్ 2 నమునాలో 24 డబుల్ బెడ్‌రూం నిర్మాణాలు, ప్రిన్సిపాల్, పరిపాలనాధికారుల నివాసానికి త్రిబుల్ బెడ్‌రూం నిర్మాణాలు 4, సెక్యూరిటీ, సందర్శకుల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు.


