తొలిరోజు హాజరు 9 శాతమే | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు హాజరు 9 శాతమే

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

అమవాస్య ప్రభావం..

నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభమవడంతో సోమవారం జిల్లావ్యాప్తంగా బడి గంట మోగింది. కొత్త విద్యా సంవత్సరానికి శ్రీకారం చుడుతూ పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. విద్యార్థుల హాజరుపై అమావాస్య ఎఫెక్ట్‌ కనిపించింది. పాఠశాల ప్రాంగణాలను రంగురంగుల కాగితాలు, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణంలో పాఠశాలలను పునఃప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు హాజరైన విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందజేశారు. దీంతో విద్యార్థులు కొత్త పుస్తకాలు రావడంతో ఆనందంలో మునిగిపోయారు.

చాలా పాఠశాలల్లో ఖాళీగా తరగతి గదులు..

మొదటి రోజు పాఠశాలలకు జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులే రాని పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని స్కూళ్లలో విద్యార్థులు ఒక్కరు కూడా రాకపోవడంతో ఉపాధ్యాయులు పాఠశాలను ఓపెన్‌ చేసి ఖాళీగా కూర్చున్నారు. కొన్ని పాఠశాలల్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులే పాఠశాలలకు వచ్చారు. అమావాస్య ప్రభావంతో పాటు మొదటి రోజు కావడంతో పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి కనబర్చలేదు.

స్వాగత ఏర్పాట్లలో అపశృతి..

పాఠశాలల పునః ప్రారంభం పండుగ వాతావరణంలో చేయాలని భావించి కొండమల్లేపల్లి పాఠశాలలో ఒక విద్యార్థి తోరణాలు కడుతున్న సందర్భంలో విద్యుత్‌ షాక్‌కు గురై ఆస్పత్రి పాలయ్యాడు.

బుధవారం నుంచి హాజరు పెరిగే చాన్స్‌

అమావాస్య కావడంతో పిల్లలను పాఠశాలలకు పంపలేదు. మంగళవారం చాలా మంది సెంటిమెంట్‌తో పాఠశాలలకు పంపే అవకాశం తక్కువ. 17వ తేదీ నుంచి ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంది. బడిబాట ద్వారా విద్యార్థులను పాఠశాలలకు తెచ్చే కార్యక్రమం చేపడుతున్నందున హాజరు శాతం పెరగనుంది. వచ్చే రెండు మూడు రోజుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఫ పండుగ వాతావరణంలో పాఠశాలలు పునః ప్రారంభం

ఫ అమావాస్య కావడంతో పిల్లలను స్కూళ్లకు పంపని తల్లిదండ్రులు

ఫ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు,

నోట్‌ బుక్స్‌ పంపిణీ

అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపకపోవడంతో విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. కేవలం 9 శాతం విద్యార్థులే హాజరైనట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు కూడా 87 శాతం వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అమావాస్య రోజు కొత్త కార్యక్రమాలు ప్రారంభించకూడదనే సంప్రదాయ భావన కారణంగా హాజరు శాతం తగ్గినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మరోవైపు కొందరు విద్యార్థులు ఇంకా బంధువుల ఇళ్ల నుంచి తిరిగి రాకపోవడం, వ్యవసాయ పనుల నేపథ్యంలో కుటుంబాలతో ఉండడం వంటి కారణాలతో కూడా గైర్హాజరైనట్లు తెలుస్తుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement