సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన వాయిదా | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన వాయిదా

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

కనగల్‌ : సీఎం రేవంత్‌రెడ్డి కనగల్‌ మండల పర్యటన వాయిదా పడిందని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం ఆయన కనగల్‌ వద్ద సభా స్థలాన్ని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 17న జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశారని.. త్వరలో మరోతేదీ ఖరారవుతుందని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తుండటంతో బహిరంగ సభ స్థలంలో నల్లరేగడి భూమి ఉండటంతో చిత్తడిగా మారిందన్నారు. పెద్ద టెంట్లు నిలబడటం లేదని, వాతావరణ పరిస్థితుల అనుకూలంగా లేని కారణంగానే వాయిదా వేశామని తెలిపారు. త్వరలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచనల మేరకు ముఖ్యమంత్రి పర్యటన తేదీ ఖరారు చేస్తామన్నారు.

విద్యా రంగాన్ని

నీరుగారుస్తున్న ప్రభుత్వం

మిర్యాలగూడ అర్బన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా బడులు ప్రారంభించి, ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్‌ విమర్శించారు. ఆదివారం మిర్యాలగూడలో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయని, వాటిని తిరిగి తెరిపించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే గత బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. సమావేశంలో కుర్ర సైదానాయక్‌, రవి, శివ పాల్గొన్నారు.

పాలిసెట్‌ తుదిదశ కౌన్సిలింగ్‌

రామగిరి(నల్లగొండ) : పాలిసెట్‌–2026 తుదిదశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైనట్లు నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, పాలిసెట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ నరసింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 నుంచి కౌన్సిలింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌, 16న సర్టిఫికెట్ల పరిశీలన, 16 నుంచి 17 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, 17 నుంచి ఆప్షన్ల ఫ్రీజింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి దశ కౌన్సిలింగ్‌కు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు ఈ తుదిదశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు నిర్ణిత తేదీల్లో తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని, హెల్ప్‌లైన్‌ సెంటర్‌ సౌకర్యాన్ని వినియోగించుకుని తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో అభ్యర్థులకు ఉచితంగా స్లాట్‌ బుకింగ్‌, వెబ్‌ ఆప్షన్ల నమోదు సౌకర్యం కల్పించినట్లు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement