దేవరకొండ : వడ్డెర సామాజికవర్గ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుకానారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వడ్డెరులను తిరిగి సంచార జాతులలో చేరుస్తూ జీవో నంబర్ 10ని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో వడ్డెర జాతి పూర్తి నిర్లక్ష్యానికి గురైందన్నారు. జీవో విడుదలలో కీలక పాత్ర పోషించిన పల్లపు సమ్మయ్యకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
ఫ ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న
రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ కార్మికులు సంస్థ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడానికి సహకరించాలని రీజినల్ మేనేజర్ జ్యోత్స్న వెల్లడించారు. శనివారం ఆమె నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్‌లో జరిగిన సమ్మె సందర్భంగా కార్మికులు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సానుకూలంగా పరిశీలించిందని తెలిపారు. ఈ కమిటీ ఇప్పటికే సమావేశమై విలీనానికి సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందని వివరించారు. కార్మికుల భవిష్యత్‌కు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా
లింగస్వామి
చిట్యాల : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కత్తుల లింగస్వామి ఎన్నికయ్యారు. తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలో ఆ సంఘం జిల్లా మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానన్నారు.
పీజీ పాఠ్యాంశంగా
‘పాన్ మరక’
రామగిరి (నల్లగొండ) : డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ (తెలుగు) మొదటి సంవత్సరం, సెకండ్ సెమిస్టర్ ఆధునిక కవిత్వం పాఠ్యాంశాల్లో నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క నివాసి, ప్రముఖ కవి అలీ రాసిన ‘పాన్ మరక’ కవితకు చోటు దక్కినట్లు అకడమిక్ తెలుగు కౌన్సిలర్, కవి, రచయిత పున్నమి అంజయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలీ రాసిన ‘పాన్ మరక’ కవితలో జీవం, జీవితం ఉన్నాయని, నిఖార్సైన ముస్లిం మైనారిటీల జీవితాల్లోని పేదరికాన్ని, యథార్థ పరిస్థితులను ఈ కవిత కళ్లకు కడుతుందని కొనియాడారు. సమాజంలోని వాస్తవాలను ప్రతిబింబించే ఇలాంటి ఉత్తమ కవితకు పీజీ పాఠ్యాంశాల్లో స్థానం లభించడం నల్లగొండ జిల్లాకే గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ పాఠ్యాంశాల్లో అలీ కవితతో పాటు తెలుగు సాహితీ లోకంలో విశేష గుర్తింపు పొందిన ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎన్.గోపి రాసిన ‘రొట్టె’ కవితకు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ కవి జూలూరు గౌరీశంకర్ రాసిన ‘నాలుగో కన్ను’ కవితకు కూడా స్థానం కల్పించారని అంజయ్య పేర్కొన్నారు. సాహిత్య విలువలున్న ఉత్తమ కవితలను పీజీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఎంపిక చేసినందుకు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి, పాలకమండలికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు.


