నల్లగొండ : ఓటు హక్కును కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా యోధుడిలా పని చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలో బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏ) సర్‌పై నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అర్హులైన వారి ఓట్లు జాబితా నుంచి తొలగించకుండా బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేద్దామన్నారు. జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేలో కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలన్నారు. జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి ఎక్కడైనా పొరపాట్లు ఉంటే అభ్యంతరాలు దాఖలు చేయాలన్నారు. ప్రజల మద్దతును ఓట్లుగా మార్చి భద్రపరచడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అన్నారు. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడి ఫలితాలను తారుమారు చేసేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో బీజేపీ కుట్రలు చేసి సర్ ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడిందని ఆరోపించారు. రాజ్యసభ సీటు చోరీకి పాల్పడిందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు పోకుండా బీజేపీ కుట్ర చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు. శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, టీపీసీసీ నియమిత ట్రైనర్ వెంకటరమణ.. సర్ విధి విధానాలు, ఓటర్ల జాబితా సవరణ, బీఎల్‌ఎల బాధ్యతలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నియోజకవర్గ సర్ పరిశీలకులు రాంజీ, మేయర్ బురి చైతన్య, డిప్యూటీ మేయర్ మహ్మద్ అష్రఫ్ అలీ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జూకూరి రమేష్, గడ్డం అనూప్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ అర్హుల ఓట్లు జాబితా నుంచి
తొలగించకుండా చూడాలి
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


