ఆత్మహత్యలతో సమస్య పరిష్కారం కాదు | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యలతో సమస్య పరిష్కారం కాదు

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

నల్లగొండ : చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు పట్టింపులకు పోకుండా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. శుక్రవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుత్తా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుడు శంకరయ్యగౌడ్‌ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆత్మహత్యల వల్ల కుటుంబాలు నష్టపోతాయని చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని ఈసారి తాలు సమస్య ప్రధానంగా ఉందన్నారు. తాలు విషయంలో కలెక్టర్లు, మిల్లర్లు, రైతులతో కలిసి ఒప్పందానికి వచ్చినట్లు తెలిసిందన్నారు. రైతు బోనస్‌, రైతుబంధు ప్రభుత్వానికి ఆర్థికంగా భారమనే విషయం వాస్తవమేనని ఈ విషయంలో రైతుబంధు, సన్నాలకు బోనస్‌.. ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం ఆలోచన చేసి ఏదో ఒక పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే బాగుంటుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవాలని కేంద్రానికి విన్నవించినా అక్కడ నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నారు. ధాన్యం కొనుగోలు, ఆర్టీసీ సమ్మె విషయంలో వాస్తవాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనాలను పొందాలని చూస్తున్నాయన్నారు. కాలేశ్వరం విషయంలో పీసీ ఘోష్‌ కమిషన్‌ విషయంలో ఎవరికీ హైకోర్టు క్లీన్‌ చీట్‌ ఇవ్వలేదని, సెక్షన్‌ 8 ప్రకారం నోటీసులు ఇవ్వలేదు కాబట్టే హరీష్‌రావు, కేసీఆర్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపిందన్నారు.

ఫ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement