పూజల పేరిట బంగారు ఆభరణాలు మాయం | - | Sakshi
Sakshi News home page

పూజల పేరిట బంగారు ఆభరణాలు మాయం

Feb 25 2026 10:28 AM | Updated on Feb 25 2026 10:28 AM

పూజల పేరిట బంగారు ఆభరణాలు మాయం

పూజల పేరిట బంగారు ఆభరణాలు మాయం

మిర్యాలగూడ అర్బన్‌: దొంగ బాబా అవతారమెత్తి ప్రజలను నమ్మించి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న వ్యక్తిని మిర్యాలగూడ టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్‌ సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం గట్టికల్‌ గ్రామానికి చెందిన కోన వినోద్‌కుమార్‌ ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తాను చేసే పనితో డబ్బులు సరిగా రాక.. దొంగ బాబా అవతారమెత్తాడు. అనారోగ్యంతో బాధపడే పిల్లల కాళ్లకు కడియాలు వేసి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో క్షుద్రపూజలు, మంత్రాలు చేసి ప్రజల నుంచి బంగారం, నగదును కాజేయడం ప్రారంభించాడు. మిర్యాలగూడ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన అడావత్‌ శిరీష, గోవింద్‌ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్న తమ పిల్లల కాళ్లకు కడియాలు వేయించారు. ఓ రోజు గోవింద్‌ ఇంటికి వచ్చిన వినోద్‌కుమార్‌ గోవింద్‌ వైపు చూసి ‘నీకు ప్రాణహాని ఉంది.. ఆయుష్షు పెరగాలంలే క్షుద్రపూజలు చేసి అమ్మవారికి ముడుపు కట్టాలి’ అని భయపెట్టాడు. ఇది నమ్మిన గోవింద్‌ దంపతులు తమ వద్ద ఉన్న 5.7 తులాల బంగారు నగలను ముడుపు కట్టేందుకు వినోద్‌కు అప్పగించారు. ముడుపు గుడ్డలో కట్టిన బంగారాన్ని 41రోజుల వరకు విప్పొద్దని వినోద్‌కుమార్‌ వారికి చెప్పాడు. అలా చేస్తే ఆయుష్షు పెరగడమే కాకుండా లక్ష్మీ కటాక్షం వరిస్తుందని నమ్మించి.. ఇంట్లోనే పూజలు మొదలు పెట్టాడు. పూజలు చేసే సమయంలో గోవింద్‌ దంపతులను కళ్లు మూసుకోవాలని చెప్పి సినీఫక్కీలో గుడ్డలో కట్టిన బంగారాన్ని కాజేసి దాని స్థానంలో ఇతర వస్తువులను అందులో పెట్టాడు. అంతేకాకుండా పూజలు చేసినందుకు రూ.13,200 ఫోన్‌పే చేయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 41 రోజుల తర్వాత గోవిండ్‌ దంపతులు ముడుపు విప్పి చూస్తే బంగారం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించారు. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు మేళ్లచెరువు, నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామంలో, నూతనకల్‌ మండలంలోని పెద్దనెమలి గ్రామంలో ఇదేవిధంగా బంగారం కాజేసి బ్యాంకులో గోల్డ్‌లోన్‌ తీసుకొని జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

దొంగ బాబాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

రిమాండ్‌కు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement