అప్పులు చేసి.. చైన్ స్నాచర్‌గా మారి
నకిరేకల్ : ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్‌లు చేస్తున్న వ్యక్తిని నల్ల గొండ జిల్లా కేతేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నల్లగొండ ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. గత నెల 24న అర్ధరాత్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా సమీపంలోని అరిటాకు భోజనం హోటల్ వద్ద భోజనం కోసం ఆగింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కన్మతరెడ్డి విజయలక్ష్మి భోజనం చేసి బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 40 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కోని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సోమవారం రాత్రి కేతేపల్లి మండలం చీకటిగూడెం శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవేపై పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. బైక్‌పై అటుగా వస్తున్న ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన తాడేపల్లి మధు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకుని విచారించగా చైన్ స్నాచింగ్‌లు చేస్తున్నట్లు నేరం ఒప్పుకున్నాడు. మధు ట్రావెల్స్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, తన స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకుని అప్పుల పాలై, అప్పులు తీర్చేందుకు చోరీలు చేస్తున్నట్లు ఏఎస్పీ రమేష్ తెలిపారు. ఈ క్రమంలోనే కొర్లపహాడ్ టోల్‌ప్లాజా సమీపంలో అరిటాకు భోజనం హోటల్ వద్ద బస్సు ఎక్కుతున్న విజయలక్ష్మి మెడలోని బంగారు పుస్తెలతాడును చోరీ చేశాడని, ఆ పుస్తెలతాడును కరిగించి బంగారం ముద్ద చేయించినట్లు వివరించారు. అదేవిధంగా మరోసారి కేతేపల్లి శివారులోని సాయికృష్ణ హోటల్ దగ్గర మరో చైన్ స్నాచింగ్ చేసి హైదరాబాద్‌కు వెళ్లి బైక్‌పై వస్తుండగా.. కేతేపల్లి పోలీసులకు చిక్కాడని ఏఎస్పీ రమేష్ వివరించారు. నిందితుడి నుంచి 40 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
పోలీసులకు చిక్కిన దొంగ
40 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం


