మాతా, శిశువుకు భరోసాగా..
అన్ని సదుపాయాలు ఉండడం వల్లే..
మాతా, శిశు మరణాల వివరాలు ఇలా..
నల్లగొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ద్వారా అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు మాతా శిశువులకు భరోసాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడంతో జిల్లాలో ఎనిమిదేళ్లుగా మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పడుతూ వస్తోంది. గతంలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు సరైన వైద్యం, పౌష్టికాహారం అందకపోవడం, రక్తహీనత కారణంగా జిల్లాలో మాతా శిశు మరణాలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహహారం అందించడంతో పాటు సకాలంలో వ్యాధి నిరోదక టీకాలను అందిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రత్యేక వైద్యులతో వైద్యం చేయిస్తుండడంతో ఏటేటా మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి నిష్ణాతులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్లు ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులను ప్రభుత్వం నియమించింది. అత్యాధునిక వైద్య పరీక్షల కోసం పరికరాలను సమకూర్చింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక సదుపాయాలతో గర్భిణులు, నవ జాత శిశువులకు అవసరమైన విభాగాలను ఏర్పాటు చేసింది. ఐసీయూ, కేఎంసీ వంటి విభాగాలను అందుబాటులో ఉంచడంతో గత కొన్నేళ్లుగా మాతా శిశు మరణాలు తగ్గుతున్నాయి.
గర్భిణుల నమోదు
నుంచి పర్యవేక్షణ..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు వాటికి అనుబంధంగా ఉన్న ఉప కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. ఓ మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి తల్లీబిడ్డను ఇంటికి చేర్చే వరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, గర్భిణులకు సేవలందిస్తున్నారు. నెలలు నిండగానే 102 వాహనాన్ని రప్పించి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి కాన్పు అయిన తర్వాత తల్లీబిడ్దలను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు.
వాట్సప్ గ్రూప్‌లో వివరాలు..
జిల్లాలోని దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, మర్రిగూడ ఆసుపత్రులకు ప్రసవాల కోసం వెళ్లిన వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అత్యవసర చికిత్సల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంసీహెచ్ వాట్సప్ గ్రూప్‌ల్లో గర్భిణుల ఆరోగ్య సమస్య, అందించాల్సిన చికిత్స వివరాలను నమోదు చేస్తారు. ఆ గ్రూప్‌లో ఉన్న సంబంధిత వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై గర్భిణి వచ్చిన వెంటనే సకాలంలో చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సౌకర్యాలు కల్పిస్తుండడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయి. గర్భిణులు కూడా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వైద్యులు చెప్పే సూచనలు పాటిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకోవడం వల్ల మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్,
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
సంవత్సరం శిశు మాత
2018–19 335 14
2019–20 395 18
2020–21 329 08
2021–22 310 26
2022–23 317 13
2023–24 216 12
2024–25 169 07
2025–26 జనవరి 72 09
ఫ వైద్యారోగ్య శాఖ వినూత్న కార్యక్రమాలు
ఫ ఏటేటా తగ్గుతున్న తల్లిబిడ్డల మరణాల రేటు
ఫ గర్భం దాల్చిన మహిళ ప్రసవించే వరకు
ప్రత్యేక పర్యవేక్షణ
ఫ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన
వైద్యం అందడమే కారణం
మాతా, శిశువుకు భరోసాగా..


