స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో ఆత్మకూర్(ఎస్)మండలానికి చెందిన విద్యార్థి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన ఎస్. శ్రీనాథ్ గతేడాది ఆదిలాబాద్‌లోని స్పోర్ట్స్ స్కూల్‌లో 6వ తరగతి చదివాడు. ఈ విద్యాసంవత్సరం 7వ తరగతిలో హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌కు బదిలీ అయ్యాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం స్కూల్‌లో శ్రీనాథ్ ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పాఠశాల సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆస్పత్రికి చేరుకొని శ్రీనాథ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే శ్రీనాథ్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.


