బైక్‌ను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

బైక్‌ను తగులబెట్టిన  గుర్తుతెలియని వ్యక్తులు

బైక్‌ను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

మఠంపల్లి: ఇంటి బయట పార్కింగ్‌ చేసిన బైక్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నిప్పుపెట్టడంతో కాలిబూడిదైంది. ఈ ఘటన మఠంపల్లి మండలం లాలితండాలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఆదివారం బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. లాలితండాకు చెందిన వార్డు సభ్యుడు భూక్యా కమల్‌నాయక్‌ తన బైక్‌ను శనివారం రాత్రి ఇంటి పార్కింగ్‌ చేశాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌కు నిప్పుపెట్టి తగలబెట్టారు. ఆదివారం ఉదయం బైక్‌ తగలబడినట్లు గుర్తించిన బాధితుడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి. బాబు తెలిపారు.

లారీ ఢీకొని కారు బోల్తా

దేవరకొండ: లారీ ఢీకొని కారు పల్టీ కొట్టిన ఘటన దేవరకొండ పట్టణ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట గ్రామానికి కంభంపాటి ఇందిర, కంభంపాటి కుందన ఆదివారం డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురుకుల ప్రవేశ పరీక్ష రాసి తమ బాబాయి కిరణ్‌ కారులో తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో దేవరకొండ పట్టణ శివారులోని ఉప్పువాగు సమీపంలోకి రాగానే వెనుక నుంచి లారీ వచ్చి వీరి కారును ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

బైక్‌పై నుంచి పడి

యువకుడి మృతి

కొడకండ్ల : బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల శివారులో తిరుమలగిరి మండలం వెలిశాల హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆదివారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ చింత రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కోక్యాతండాకు చెందిన గుగులోత్‌ నెహ్రూ(38) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పని నిమిత్తం శనివారం బైక్‌పై వెలిశాల గ్రామానికి వెళ్లాడు. తిరిగి రాత్రి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో అదే తండాకు చెందిన గుగులోత్‌ శంకర్‌ బైక్‌పై వెలిశాల హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద అతడికి అడ్డురావడంతో నెహ్రూ బైక్‌పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రమాదవశాత్తు బావిలో

పడి బాలుడి మృతి

దేవరకొండ : ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన ఆదివారం దేవరకొండ పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మడమడక గ్రామ జీపీఓగా పనిచేస్తున్న ఇరిగి శంకర్‌ కుమారుడు అన్మోల్‌(11) పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం తండ్రి శంకర్‌తో కలిసి బాలుడు ముదిగొండ రోడ్డులో వాకింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలోని బావిలో పడి అన్మోల్‌ మృతిచెందాడు. మృతదేహాన్ని దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement