రైతులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు
నకిరేకల్: అక్రమంగా మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్నారని రైతులపై పోలీసులు, ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండలం గొల్లగూడెం శివారులోని భూపతి కుంటను ఆదివారం చిరుమర్తి లింగయ్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపతి కుంటలో నెల రోజులుగా రోడ్డు పని పేరుతో ఇక్కడి ఎమ్మెల్యే పేరు చెప్పుకుని భారీగా మట్టిని అక్రమంగా తరలించారని ఆరోపించారు. తాజాగా ఇక్కడ రైతులు కుంట సమీపంలో తమ పట్టా భూముల్లో మట్టిని తీస్తుండగా పోలీసులు, ఇరిగేషన్ అధికారులు సందర్శించి కుంట భూమిలో తవ్వకాలు చేస్తున్నారని వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. భూపతి కుంటలో వారు చేస్తున్న మట్టి దందాను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ఒత్తిడితో బీఆర్‌ఎస్‌కు చెందిన రైతులపై అక్రమ కేసులు నమోదు చేయడం తగదన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, కట్టంగూర్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తలారి బలరాం, నాయకులు సూదిని జానకీరెడ్డి, యానాల లింగారెడ్డి, జీడిపల్లి శేఖర్‌రెడ్డి ఉన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


