నాటి భక్తోత్సవాలే.. నేటి బ్రహ్మోత్సవాలు
యాదగిరి క్షేత్రం.. దినదినాభివృద్ధి
యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతంత్య్రానికి ముందే స్థానికులు మూడ్రోజులుగా భక్త్త్సోవాలు నిర్వహించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. శ్రీస్వామి వారిపై నమ్మకంతో భక్తులు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
పూర్వం కాలంలో ఘాట్ రోడ్డు లేక, మెట్లదారి కూడా అంతంతే ఉండటంతో భక్తోత్సవాలకు వచ్చే భక్తులు కొండ ఎక్కేందుకు నానా ఇక్కట్లు పడేవారు. అయితే ఈ ప్రాంత వాసులు శ్రీస్వామిని ఆరాధించేందుకు ఎలాగో కొండెక్కేవారట. ఉత్సవాలు జరిపేందుకు ఉత్సాహాన్ని కనబర్చేవారని పూర్వీకులు చెబుతారు. ఈ క్రమంలో అప్పట్లో తొలుత మూడు రోజులు ఉత్సవాలను నిర్వహించారు. కీకారణ్యం, వసతులు లేని కాలంలో (సుమారు 1895) ప్రాంతంలో ఆ ఉత్సవాలు జరిగాయి. అప్పట్లో భక్తులు నిర్వహించవారు కాబట్టి.. వాటిని భక్తోత్సవాలనేవారు. కొన్నేళ్లు గడిచాక ఐదు రోజులకు పెంచారు. అయితే మార్గశిర మాసంలో ఆ సంబురాలు జరిగేవి. ఆ కాలంలో శ్రీస్వామి ఉత్సవాలు జరపడం సబబుకాదంటూ అప్పట్లోనే పూజారులు కొందరు ఫాల్గుణ మాసంలో 11 రోజుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లోనే హైదరాబాద్, మహబూబ్‌నగర్, మహారాష్ట్ర, వరంగల్ వంటి ప్రాంతాలకు చెందిన భక్తులు అధికంగా ఈ క్షేత్రానికి వచ్చేవారని పాతతరం వారు చెబుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక అప్పటి ఆలయ కమిటీ పెద్దలు ఆచార్యులతో సంప్రదించి 1955లో 11 రోజుల బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి శ్రీస్వామి బ్రహ్మోత్సవాలు నేటికీ కొనసాగుతూ వస్తున్నాయి. ఏటా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు ఎందరినో ప్రముఖులను స్వాగతిస్తున్నారు.
యాదగిరిగుట్ట : యాదవ మహర్షి ఘోర తపస్సుతో యాదగిరిగుట్టలోని కొండ గుహల్లో వెలసిన పంచనారసింహుడి క్షేత్రం దినాదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు కింకారణ్యం గుట్టలో వెలసిన శ్రీస్వామికి భక్తులు నిత్యం పూజలు చేస్తుండే వారు. హైదరాబాద్ వాస్తవ్యులు రాజామోతీలాల్ 1920లో శ్రీస్వామికి ఆగమశాస్త్రం ప్రకారం పూజాది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి క్షేత్రం అభివృద్ధికి బాటలు వేశారని చరిత్రకారులు చెబుతారు. ఆ తరువాత ప్రభుత్వాల తోడ్పాటుతో క్షేత్రం అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అప్పటి సీఎం కేసీఆర్ చొరవతో యాదాద్రి క్షేత్రాన్ని కనీవిని వెరుగని రీతిలో ఆలయ పునర్నిర్మాణం చేసి 2022 మార్చి 28న ప్రధానాలయాన్ని మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన కార్యక్రమం చేయించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో గతేడాది క్షేత్రంలోని విమాన గోపురానికి 65 కిలోల బంగారంతో తాపడం చేసి శ్రీస్వామి వారికి అంకితమిచ్చారు.
ఫ పూర్వ కాలంలో మూడు రోజులే
ఉత్సవాల నిర్వహణ
ఫ 1955 నుంచి 11 రోజుల
ఉత్సవాలకు శ్రీకారం
నాటి భక్తోత్సవాలే.. నేటి బ్రహ్మోత్సవాలు


