చెట్ల పొదల్లో నవజాత శిశువు
కోదాడ రూరల్ : ఆడబిడ్డ భారం అనుకున్నారో.. లేక మరేదో కారణమో తెలియదు కానీ ఓ నవజాత శిశువును చెట్ల పొదల్లో వదిలి పేగుబంధం తెచ్చుకుంది ఓ తల్లి. ఈ అమానవీయ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుడిబండ గ్రామానికి ఆనుకొని ఉన్న వ్యవసాయ పొలంలో కూలీలు కలుపు తీసేందుకు వెళ్లగా రోడ్డుకు కొద్దిదూరంలో చెట్ల పొదల్లోనుంచి ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. వారు ఎదురుగా ఉన్న ఇంటి వారితో కలిసి అక్కడకు వెళ్లి చూడగా నుదిటిపై స్వల్పగాయంతో ఓ ఆడశిశువు కనిపించింది. వారు ఆ శిశువును దగ్గరకు తీసుకొని పాలుపట్టించి పోలీసులుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు.. గ్రామ కార్యదర్శికి, ఐసీడీఎస్, వైద్య సిబ్బందికి విషయాన్ని తెలిపి అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ శిశవును చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు శిశువు జన్మించి 24 గంటలు అవుతుందని నుదిటిపై ఉన్న గాయాన్ని బట్టి చూస్తే మంగళవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో అక్కడ వదిలి ఉండవచ్చని, శిశువు ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. నుదిటిపై గాయం, పొట్టపై చారలు ఉండటంతో రెండు రోజుల వైద్య చికిత్సకోసం సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నల్లగొండలోని శిశుగృహలో అప్పగిస్తామని ఐసీడీఎస్ నిర్వాహకులు తెలిపారు.
కుక్కలు తిరిగే ప్రదేశంలో వదిలి..
పసికందును వదిలివెళ్లిన ప్రదేశంలో పదుల సంఖ్యలో కుక్కలు తిరుగుతుంటాయి. గ్రామ శివారు కావడంతో చికెన్ వ్యర్థాలతో పాటు గ్రామంలోని చెత్తాచెదారం కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు వెంటనే పడేస్తుంటారు. వాటిని తీనేందుకు అక్కడ కుక్కలు గుంపులుగా తిరుగుతూ రోడ్డుపై వెళ్లే వారివెంట కూడపడుతుంటాయి. అలాంటి ప్రదేశంలోనే ఆ పసికందును వదిలి వెళ్లారని కుక్కలు చూస్తే దారుణం జరిగేదని గ్రామస్తులు అంటున్నారు.
ఫ ఆడ శిశువును వదిలివెళ్లిన
గుర్తుతెలియని వ్యక్తులు
ఫ కోదాడ మండలం
గుడిబండ శివారులో ఘటన
చెట్ల పొదల్లో నవజాత శిశువు


