నేడు పుర పట్టాభిషేకం
నీలగిరిలో పెరిగిన కాంగ్రెస్ స్థానాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కార్పొరేషన్, మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఉదయం 10 గంటలకు గెలిచిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించి, ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా మున్సిపాలిటీల ఎన్నికల అబ్జర్వర్‌తో పాటు ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కార్పొరేషన్‌తోపాటు ఆయా మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాంపుల్లో ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంతా సోమవారం నేరుగా ఎన్నికల సమావేశాలకు హాజరు కానున్నారు. సోమవారం ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజు నిర్వహించనున్నారు.
మేయర్‌గా బుర్రి చైతన్య ఎన్నిక లాంఛనమే
నల్లగొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 27 డివిజన్లలో విజయం సాధించింది. మేయర్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 25 కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో ఎన్నికలకు ముందుగానే మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రకటించడం, పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో సోమవారం మేయర్‌గా ఆమెను కార్పొరేటర్లంతా ఎన్నుకోనున్నారు.
ఎంఐఎంలో చేరిన మొయిన్
26వ డివిజన్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ మొయిన్ ఈ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి టికెట్ ఆశించారు. ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో అదే డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన తల్లి గౌషియాను పోటీలో నిలిపారు. ఆమె విజయం సాధించారు. కాగా, ఆదివారం మొయిన్ హైదరాబాద్‌లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో తిరిగి ఆ పార్టీలోనే చేరారు.
ఎమ్మెల్యేలు చెప్పిన వారికే..
జిల్లాల్లోని మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారమే చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లను ప్రకటించనున్నారు. వారినే ఎన్నుకోవాలని కౌన్సిలర్లకు చెప్పనున్నారు.
మున్సిపాలిటీల్లో సస్పెన్స్
● దేవరకొండ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఎన్నిక లాంఛనమే కానుంది. చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు నుంచి పోటీ చేసిన గెలిచిన పున్న శైలజ వెంకటేష్ పేరును ఎన్నికలకు ముందుగానే ఎమ్మెల్యే బాలునాయక్ ప్రకటించారు. దీంతో సోమవారం ఆమెను ఛైర్‌పర్సన్‌గా కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు. వైస్ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారన్నది తేలలేదు. సోమవారం ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే బాలునాయక్ వైస్ చైర్మన్ పేరును ప్రకటించనున్నారు.
● చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్‌గా 12వ వార్డు కౌన్సిలర్ పందిరి గీత పేరు ఖరారైనట్లు తెలిసింది. చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్ పేర్లను ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే వీరేశం చెప్పనున్నారు.
● చండూరు మున్సిపల్ చైర్మన్‌గా ఆరో వార్డు కౌన్సిలర్ కోడి శ్రీనివాసులు పేరును ఖరారు చేసినట్లు తెలిసింది.
● మిర్యాలగూడ, నందికొండ, హాలియా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎవరిని చేయాలన్న విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు చర్చించారు. అయితే పేర్లను ప్రకటించలేదు. సోమవారం ఎన్నిక సమయంలో వారి పేర్లను ప్రకటించనున్నారు.
నల్లగొండలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కమిషనర్
నీలగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో నలుగురు విజయం సాధించారు. అయితే అందులో ముగ్గురు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 30కి చేరింది. 18వ డివిజన్‌లో విజయం సాఽధించిన ఆలకుంట్ల ఝాన్సీరాణి నాగరత్నంరాజు, 42వ డివిజన్‌లో విజయం సాధించిన అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్, 11వ డివిజన్‌లో విజయం సాధించిన పాలకూరి సుమలత సంతోష్ ఆదివారం మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. దీంతో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లే. సోమవారం జరిగే మేయర్ ఎన్నికల్లో వారు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపనున్నారు.
ఫ ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
ఫ 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక
ఫ ఎన్నికల అబ్జర్వర్, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు
ఫ క్యాంపుల నుంచి
నేరుగా సమావేశాలకు హాజరు కానున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు
ఫ ఎన్నిక వాయిదా పడితే
మరుసటి రోజు నిర్వహణ


