ఛాయా సోమేశ్వరాలయానికి యునెస్కో గుర్తింపునకు కృషి
రామగిరి(నల్లగొండ ): పానగల్లు ఛాయా సోమేశ్వరాలయానికి అంతర్జాతీయ యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శివరాత్రి సందర్భంగా నల్లగొండ సమీపంలోని పానగల్లు పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలను దర్శించుకున్నారు. ఛాయా సోమేశ్వరాలయంలో శివ పార్వతుల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శివుడికి అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అద్భుత శైలిలో 11వ శతాబ్దంలో నిర్మించిన పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం శివ లింగంపై నిరంతరం పడే ఛాయ ఎంతో విశిష్టత కలిగిందన్నారు. రామప్ప దేవాలయం మాదిరిగా చారిత్రక సంపద అని పేర్కొన్నారు. సంస్కృతిని పెంపొందిస్తూ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం యునెస్కో గుర్తింపునకు అర్హత కలిగి ఉందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి, సంబంధిత శాఖ కేంద్ర మంత్రిని కోరుతానన్నారు. నిత్యం భక్తులు దర్శించుకునేలా అన్ని వసతులు కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తద్వారా టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. అదే విధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు ఉండబోవని, బడ్జెట్ తర్వాతే ఉంటాయని స్పష్టం చేశారు.
కార్పొరేషన్ విజయం బాధ్యత పెంచింది
నీలగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయం మాపై బాధ్యత మరితం పెంచిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నీలగిరి కార్పొరేషన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయన్నారు. నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. 48 డివిజన్లలో ప్రజల సమస్యలు, డ్రెయినేజీ, మంచి నీటి వసతి, పార్కుల అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. మాపై నమ్మకంతో గెలిపించిన పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మొక్కలు నాటిచేందుకు కలెక్టర్.. హార్టికల్చర్ అధికారులతో చర్చిస్తున్నారని చెప్పారు. చందనపల్లి డంపింగ్ యార్డును మరో మూడు నాలుగు నెలల్లో వేరే చోటకి మారుస్తామన్నారు.
ఫ ఎంపీటీసీ, జెడ్పీటీసీ
ఎన్నికలు ఇప్పట్లో ఉండవు
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన మంత్రి, కార్పొరేటర్లు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్లను క్యాంపు కోసం హైదరాబాద్‌లోని శామీర్‌పేటలో గల ఓ రిసార్ట్‌కు తరలించిన విషయం తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం కీసరగుట్టలోని శివాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్లు దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం తిరిగి రిసార్ట్‌కు వెళ్లారు. సోమవారం అక్కడి నుంచి నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి రానున్నారు.


