గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలి
నల్లగొండ టూటౌన్ : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వెలికి తీయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారుల ప్రతిభను గుర్తించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన వేదిక లేని కారణంగా క్రీడాకారులు ముందుకు రాలేకపోతున్నారని తెలిపారు. సీఎం కప్ వంటి క్రీడలు ప్రతిభకు అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. క్రీడా పోటీల ద్వారా యువతలో జట్టు భావన, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యకరమైన జీవన శైలి పెంపొందుతాయన్నారు. సీఎం కప్ క్రీడల్లో భాగంగా క్రికెట్, హాకీ, బేస్ బాల్, తైక్వాండో, సైక్లింగ్, క్యారం, షూటింగ్ సీలింగ్, రోయింగ్, సెన్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, తహసీల్దార్ పరుశురాం పాల్గొన్నారు.
ముగిసిన ఎడ్ల పందేలు
చిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ జాతర, శివరాత్రి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల ఎడ్ల పందేలు ఆదివారం ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వట్టికూటి నాగయ్య, ఉప సర్పంచ్ ఏడు కొండలు, బండ్ల ప్రశాంతి కోటయ్య పాల్గొన్నారు.
మేళ్లచెరువులో..
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాల సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఆదివారం జాతీయ స్థాయి ఎద్దుల పందేలు నిర్వహించారు. పాలపండ్ల విభాగం ఎద్దుల పందేలను కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఐరా రియాలిటీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి ప్రారంభించారు.
1/1
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలి