వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ప్రకృతి, వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల గుండా నెల రోజులుగా చేపడుతున్న ప్రకృతి విజ్ఞానయాత్ర సోమవారం ఎంజీ యూనివర్సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఎంజీ సెమినార్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వీసీ హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి హేతుబద్ధమైన వైజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ప్రతి అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, లోతైన పరిశీలన, సామాజిక అన్వయింపు ద్వారా శాస్త్రజ్ఞులుగా తయారై దేశసేవలో భాగస్వాములు కావాలని కోరారు. కవి, వాగ్దేయకారుడు జయరాజ్ మాట్లాడుతూ మానావళి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరు ప్రకృతిపై అవగాహన కలిగి ఉండాలని, మొక్కలు నాటడం తమ బాధ్యతగా బావించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విజ్ఞానదర్శిని వ్యవస్థాపకులు రమేష్, గంజి ఈశ్వరలింగం, సురేష్‌కుమార్, స్వరాజ్యం, ఎం.వెంకటరమణారెడ్డి, సురేష్‌రెడ్డి, షరీఫ్, కిరణ్, రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


