ఈసారైనా.. అందేనా!
ఈ ఏడాది పరిహారమైనా ఇచ్చేనా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పంట నష్ట పరిహారం పరిహాసంగా మారింది. అకాల వర్షాలతో ఆగమైన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఎప్పుడు ఇస్తుందో ఎప్పుడు ఇవ్వదో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మూడేళ్ల కాలంలో అకాల వర్షాలు, తుపాన్ల ప్రభావంతో ఆరుసార్లు పంటలు నష్టపోతే ఇప్పటివరకు ప్రభుత్వం రెండుసార్లు మాత్రమే పరిహారం చెల్లించింది. మూడుసార్లు చెల్లించలేదు. ఇక మొన్నటి అక్టోబర్ నెలలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈసారైనా ప్రభుత్వం పరిహారాన్ని ఇస్తుందా? లేదా? అని నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇచ్చేదే అరకొర.. అదీ సరిగ్గా ఇవ్వని ప్రభుత్వం
జిల్లాలో ఏటా వేల మంది రైతులు అకాల వర్షాలతో పంటలను నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడిని కోల్పోవడంతోపాటు దిగుబడి తగ్గిపోయి అప్పులపాలు అవుతున్నారు. అయినా ప్రభుత్వం పంట నష్టం విషయంలో పక్కాగా వ్యవహరించడం లేదు. 33 శాతానికి కంటే ఎక్కువ పంట నష్టం వాటిల్లితేనే నష్టం జరిగినట్లుగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి పంపిస్తున్నారు. దీంతో నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరగడం లేదు. రైతులు ఎకరం వరి, పత్తి పంటలకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి సాగు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం రైతులకు పంట నష్ట పరిహారం కేవలం రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించడంతో నిరాశ చెందుతున్నారు.
మూడేళ్లలో రెండుసార్లే పరిహారం చెల్లింపు..
జిల్లాలో 2023 నుంచి ఇప్పటివరకు వరకు అకాల వర్షాలు, తుపాన్ల కారణంగా ఆరుసార్లు పంట నష్టం వాటిల్లింది. కేవలం రెండుసార్లు జరిగిన నష్టానికి మాత్రమే పరిహారం చెల్లించింది. 2023 మార్చి నెలలో కురిసిన అకాల వర్షాల కార ణంగా జిల్లాలో 323 రైతులకు చెందిన 371.24 ఎకరాల్లో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లగా, వారికి మాత్రం రూ.37.16 లక్షలు పరిహారంగా ఎకరాకు రూ.10 చొప్పున చెల్లించింది. ఇక 2024 ఏప్రిల్‌లో వర్షాల కారణంగా 31 మంది రైతులకు చెందిన 32.08 ఎకరాల్లో పత్తి, వరికి నష్టం వాటిల్లగా రూ.3.22 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉన్నా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. అదే ఏడాది సెప్టెంబర్‌లో అకాల వర్షాలతో 413.12 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా 454 మంది రైతులకు రూ.41.33 లక్షలు పరిహారం కింద చెల్లించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అకాల వర్షాలతో తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. అయినా ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకోలేదు. ఇక ఆగస్టులోనూ అకాల వర్షాలతో పంటల నష్టం వాటిల్లింది. దానికి సంబంధించిన పరిహారం ఇవ్వలేదు. తాజాగా అక్టోబర్ నెలాఖరులోనూ పంట నష్టపరిహారం వాటిల్లింది. అయినా ఇంతవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసకోలేదు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా 679 మంది రైతులకు చెందిన 726.36 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ వేసిన అంచనా ప్రకారం రూ.72.69 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయినా ఇంతవరకు ప్రభుత్వం దానిపై నిర్ణయమే తీసుకోలేదు. మరోవైపు ఆగస్టు నెలలోనూ అకాల వర్షాలతో 10.38 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దానికి పరిహారం ఇవ్వలేదు. ఇక గత నెలలోనూ మోంథా తుపాన్ కారణంగా రైతులు పెద్ద ఎత్తున పంటలను నష్టపోయారు. వ్యవసాయ శాఖ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను పంపించింది. దాని ప్రకారం 310 గ్రామాల్లో 30,359 మంది రైతులకు చెందిన 61,511 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అందులో అత్యధికంగా 35,487 ఎకరాల్లో వరి, 25,919 ఎకరాల్లో పత్తి, 105 ఎకరాల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఆయా రైతులకు రూ.61.51 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నష్ట పరిహారాన్ని అయినా ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదా? అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఫ మూడేళ్లలో ఆరుసార్లు పంటలు నష్టపోతే ఇచ్చింది రెండుసార్లే..
ఫ వర్షాలతో నష్టపోతున్న రైతులు.. అంచనా వేసి పంపుతున్నవ్యవసాయ శాఖ
ఫ ఎకరాకు రూ.30 వేలకుపైగా వెచ్చిస్తున్నా.. రూ.10వేలే ఇస్తామని ప్రకటన
ఫ అది కూడా సరిగ్గా అందక రైతుల ఆవేదన


